మీరట్ : దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
దళిత కుటుంబానికి చెందిన వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు వినబడటంతో చుట్టుపక్కలవారు స్పందించారు. ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరవగా, యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బలహీన ప్రాణాలు గాలిలోకి : అసలే నీరసించిన బాధితురాలి ఆరోగ్యస్థితి ఇంకా దిగజారింది. సోమవారం ఉదయాని కల్లా పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యం అందేలోపే వృద్ధురాలు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతురాలి శరీరభాగాలను లక్నోలోని ఫోరెన్సిక్ విభాగానికి పంపారు.
నిందితుడిపై హత్య కేసు : నిందితుడు అంకిత్ పునియాపై ఐసీసీ 458, 376, ఎస్సీ,ఎస్టీ చట్టాల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఐసీసీ 302 సెక్షన్‌ను కూడా చేర్చినట్లు జానీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి పీసీ శర్మ మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల కిందటే యూపీ, పంజాబ్‌లలో వృద్ధురాళ్లపై అత్యాచారం ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment