నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు గౌడ్
నంద్యాల టౌన్: బెల్టుషాపు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులను ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి అందరి ముందు కొట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన ధనుంజయగౌడ్, లక్ష్మిదేవిలు బెల్టుషాపు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ గ్రామానికి వెళ్లారు. భార్యాభర్త పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి కొట్టారు. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారి కుమారుడు వెంకటేశ్వర్లుగౌడ్(13) తల్లిదండ్రులను కొట్టడం చూసి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే పురుగుల మందు తాగాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ విషయంపై బండిఆత్మకూరు ఎస్‌ఐ విష్ణునారాయణ వివరణ ఇస్తూ బెల్టుషాప్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వారి ఇంటిపై దాడి చేశామన్నారు. 25మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లడానికి జీపులో ఎక్కాలని చెప్పగా అందుకు అంగీకరించలేదన్నారు. దీంతో బలవంతంగా స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశామనే ఉద్దేశంతో వారు ఫిర్యాదు చేసి ఉండొచ్చని తెలిపారు. కొన్ని రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులు కూడా వారి ఇంటిపై దాడి చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారని, అయినా బెల్ట్‌షాపు కొనసాగిస్తుండటంతో తాము సిబ్బందితో అక్కడికి వెళ్లామని తెలిపారు. భవిష్యత్తులో పోలీసులెవరూ వారి ఇంటి వద్దకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment