వాట్సాప్‌లో ఫొటోలు చూసి.. | Siddipet Prostitution Homes in police under control | Sakshi
Sakshi News home page

కొత్త రూట్లో హైటెక్‌ దందా

Published Thu, Nov 30 2017 11:27 AM | Last Updated on Tue, Aug 21 2018 6:10 PM

Siddipet Prostitution Homes in police under control - Sakshi

సిద్దిపేటఅర్బన్‌:  మండలంలోని బూర్గుపల్లి–ఇర్కోడ్‌ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటన సోమవారం పోలీసుల దాడుల్లో వెలుగు చూసింది. – గతంలో పట్టణంలో కొందరు వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న సంఘటనలు అధికంగానే ఉన్నాయి.

చూడడానికి అవి ఇళ్లే.. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కొందరు కనిపిస్తారు. లోపల జరిగే తతంగం మాత్రం వేరు. అదే వ్యభిచార కేంద్రం.. సిద్దిపేట పట్టణంలో ఈ పాడు వృత్తి కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. వాట్సాప్‌ ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. సెల్‌ఫోన్‌లోనే బేరసారాలు చేస్తున్నారు. కొందరు గృహిణులను సైతం ప్రలోభాలతో ఆశచూపి ఈ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పచ్చని కుటుంబాల్లో చిచ్చురేగుతోంది.

విలాసవంతమైన జీవితం కోసం..
సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాకలాంటి పట్టణాలలో విస్తరిస్తున్న హైటెక్‌ వ్యభిచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఈ దందా బాగా జరుగుతున్నట్లు సమాచారం. ఆర్థిక స్థోమత లేక పాడువృత్తిలో దిగిన మహిళలు కొందరు కాగా, మరికొందరు మరింత విలాసవంతమైన జీవితం కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వేశ్యావృత్తి చేసేవారు మంచి కుటుంబాల మహిళలను ప్రలోభాలకు గురిచేసి ఈ రంగంలోకి దించుతుండడం ఆందోళనకరంగా మారింది. ప్రతీ రోజు జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఇళ్లలో, ముఖ్యమైన హోటళ్లతోపాటు చిన్న లాడ్జీల్లో ఈ దందా నడుస్తోందంటే.. ఇది ఎంత శృతిమించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇళ్లు.. హోటళ్లు.. లాడ్జీల్లో..
ప్రత్యేకంగా వ్యభిచార కేంద్రాలని ఎవరికీ అనుమానం కలగకుండా ఇళ్లనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లల్లోనే ఈ దందా నడుస్తోంది. బంధువులు వచ్చారనో, సామగ్రి కొనుగోలు చేస్తున్నామనో పట్టపగలే విటులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. అనుమానం రాకుండా ప్రధాన ద్వారం మూయకుండా ఇద్దరు ముగ్గురు మహిళలు మాట్లాడుకుంటున్నట్లు బయట కనిపిస్తూ.. లోపల గదిలో దర్జాగా పగలే దందా చేయిస్తున్నారు. అద్దె ఇళ్లు తీసుకొని ఓ ఇంటికి ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. కొత్త బట్టలతో కనిపించాలనే ధ్యాస, విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో మహిళలు కొందిరి ప్రలోభాలకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే రాజీవ్‌ రహదారిలోనూ ఇదే దందా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పోలీసుల కనుసన్నల్లోనే..!
జిల్లా కేంద్రంలోని రూరల్, వన్‌టౌన్, టూటౌన్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దందా పోలీసుల కనుసన్నల్లోనే కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి సమాచారం ఉన్నతాధికారులకు తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో వ్యభిచార నిర్వహణను అరికట్టాల్సిన పోలీసులు ఆ నిర్వాహకులిచ్చే మామూళ్లతో పాటు మహిళలను లోబర్చుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాలానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సిద్దిపేటలో పలు ఇళ్లపై కూడా పోలీసులు దాడులు చేసి ఈ దందాలను బహిర్గతం చేసి నిర్వాహకులను పట్టుకున్న సంఘటనలు అధికంగానే ఉన్నాయి.

రూ. 5 వేల నుంచి రూ. 10వేల వరకువసూలు..
కొందరు మహిళలు యువతులను సైతం ఈ వ్యాపారంలో దించుతున్నారు. హైదరాబాద్‌తోపాటు పల్లె నుంచి వచ్చే కొందరు యువతులకు డబ్బు ఆశ చూపి ఈ రంగంలోకి దించుతూ.. వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పరిచయస్తులైన యువతులకు సైతం గాలం వేస్తున్నారు. ఒక్కో విటుడి నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 10వేల వరకు వసూలు చేస్తున్నారు. సదరు మహిళ, యువతిని బట్టి ఈ ధర ఉంటోంది. దీనికి అలవాటు పడిన యువతులు చాలా మంది రోడ్డున పడుతున్నారు. ఈ దందాలో మధ్యవర్తులే విపరీతంగా సంపాదిస్తున్నారు. ఇలాంటి దందాలో ఎలాంటి అనర్థాలు జరగక ముందే పోలీసులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

నిఘా ఉంచాం...
పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. వాటిపై ప్రత్యేక టీంతో నిఘా ఏర్పాటు చేశాం. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గుర్తు తెలియని వ్యక్తులకు, అనుమానితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దు. వాట్సాప్‌ నిర్వహణలోనూ జాగ్రత్తలు వహించాలి. – నర్సింహారెడ్డి, అడిషనల్‌ సీపీ (శాంతిభద్రతలు)

వాట్సాప్‌లో ఫొటోలు చూసి..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఈ దందా నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మంచి కుటుంబాలకు చెందిన మహిళలు సైతం ఈ రంగంలోకి దిగడంతో విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని కోసం చాలా మంది అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత వాట్సాప్‌లో విటుడి చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందుకుపోతున్నారు. పైగా సెల్‌ఫోన్‌లో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా తెలుసుకున్నాకే సదరు మహిళ ఫొటో విటుడికి పంపించి బేరమాడుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుకొని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లమనో.. లేక మార్కెట్‌లో ఫలానా చోట కలిస్తే మేం చూసి చెబుతామని చెప్పి సదరు మనిషిని చూశాకే తమకు తెలియని వ్యక్తి అని నిర్ధారణ చేసుకున్నాకే బేరమాడుతున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement