హూస్టన్: ఇండో అమెరికన్‌కు చెందిన సిక్కు పోలీస్ ఆఫీసర్‌పై ఓ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. గత పదేళ్లుగా హారీస్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ పోలీస్ ఆఫీసర్ సందీప్ సింగ్ ధాలివాల్(40) తన సేవలందిస్తున్నారు. శుక్రవారం అర్దరాత్రి స్థానికంగా ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేస్తుండగా.. కారులోంచి ఓ దుండగుడు బయటకు వచ్చి సందీప్ సింగ్‌పై అతికిరాతకంగా కాల్పులకు దిగాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన షెరీఫ్ అధికార విభాగం కారులో ఉన్న జంటను అదుపులోకి తీసుకున్నారు. అయితే సీసీ పుటేజీలను పరిశీలిస్తే సందీప్‌పై పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులకు దిగబడినట్టు తెలుస్తోందని షెరీఫ్ ఈడీ గొంజాలెజ్ తెలిపారు.
‘హిస్టరీ మేకింగ్’ పోలీస్ ఆఫీసర్
సందీప్ సింగ్ దాలివాల్ హిస్టరీ మేకింగ్ పోలీస్ ఆఫీసర్ అంటూ గొంజాలెజ్ ప్రశంసించారు. షెరీఫ్‌కు తొలి సిక్కు డిప్యూటీ సందీపే అంటూ పేర్కొన్నాడు. 2015 నుంచి గడ్డం, తలపాగాతో(9/11 అటాక్ తర్వాత పోలీసులకు కొన్ని అంక్షలు పెట్టారు) రోడ్లపై అతడు విధులు నిర్వరిస్తుంటే యువకులు ముఖ్యంగా స్థానిక సిక్కులు అతడిని ఆదర్శంగా తీసుకొని హారీస్ కౌంటీ షెరీఫ్‌లో చేరారని గుర్తుచేశారు. హరికేన్ సమయంలో ఎంతో సాహసోపేతంగా స్వయంగా ట్రక్కు నడుపుకుంటూ వెళ్లి బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాడని కొనియాడారు. నిందితుడిని త్వరలోనే పట్టుకొని తగిన శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నాడు. సందీప్ సింగ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసు ఆఫీసర్‌గానే కాకుండా సిక్కు మతానికి సంబంధించిన పలు ఆర్టికల్స్‌ను సందీప్ రాశాడు. అంతేకాకుండా సిక్కు యువత కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సహాయసహకారాలు అందించాడు. కాగా, సందీప్ సింగ్ మరణవార్తతో కుటుంబం సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment