ఘటనాస్థలిలో పడి ఉన్న మృతదేహాలు
పేరేచర్ల(ఫిరంగిపురం)/యడ్లపాడు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను సెంట్రింగ్ మెటీరియల్‌తో వెళ్తున్న ట్రాలీ ఆటో అతి వేగంతో ముందు వైపునుంచి ఢీకొట్టటంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన తమ్మిశెట్టి గోవిందు మాచవరం మండలం మల్లబోలు గ్రామ జాతరలో బొమ్మలు విక్రయించి సోమవారం వేకువజామున తన సొంత ఆటోపై స్వగ్రామానికి బయలుదేరాడు. సాతులూరు వద్ద ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.
ఆటో ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సమీపానికి వచ్చేసరికి గుంటూరు నుంచి నరసరావుపేట వైపు సెంట్రింగ్ మెటీరియల్‌తో వెళుతున్న ట్రాలీ ఆటో మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టింది. మృతుల్లో యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన తల్లీబిడ్డలు కాకాని రమాదేవి (32), చిన్నారులు బాల మణికంఠ (5), యశస్విని (11 నెలలు) తోపాటు సాతులూరుకు చెందిన విద్యుత్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ కొండ్రాతి అశోక్‌కుమార్ (32), నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఆవుల యువరాజ్ (22), చిరుమామిళ్లకు చెందిన పొగర్తి మరియమ్మ (40) ఉన్నారు. వీరితో పాటు ఆటో డ్రైవర్ తమ్మిశెట్టి గోవింద్, ప్రయాణికుడు గుంటుపల్లి సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ ఎం.వీరారెడ్డి, సీఐ అచ్చయ్య, ఫిరంగిపురం ఎస్‌ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాలీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
కళ్లెదుటే భార్య, బిడ్డల మృత్యువాత
భార్యాబిడ్డలు మృత్యువాత పడటంతో కొత్తపాలెం (పుట్టకోట) గ్రామానికి చెందిన కాకాని బ్రహ్మయ్య గుండెలవిసేలా రోదిస్తున్నాడు. బ్రహ్మయ్యకు కారంపూడి మండలం కొదమగుండ్ల గ్రామానికి చెందిన రమాదేవితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే బ్రహ్మయ్య, రమాదేవి దంపతులకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టకపోవడంతో ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎట్టకేలకు బాలమణికంఠ (5), యశస్విని (11 నెలలు) పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే, బ్రహ్మయ్యకు ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో అతనికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఈ నెల 8వ తేదీన రమాదేవి పుట్టిల్లయిన కొదమగుండ్ల గ్రామంలో వెంకటేశ్వరస్వామి గుడి ప్రతిష్ట మహోత్సవం ఉండటంతో బ్రహ్మయ్య భార్యబిడ్డలతో కలిసి బైక్‌పై అక్కడకు వెళ్లాడు. సోమవారం ఇంటికి అదే బైక్‌పై తిరిగివస్తుండగా.. సాతులూరు వద్దకు వచ్చేసరికి వర్షం కురిసింది. భార్య, పిల్లలు తడిసిపోతారన్న ఉద్దేశంతో వారిని ఆటో ఎక్కించి బ్రహ్మయ్య బైక్‌పై ఆటోను అనుసరిస్తూ వచ్చాడు. వారిని ఆటో ఎక్కించిన 15 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒకవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన భార్య.. కన్నతల్లి పొత్తిళ్లలోనే ఊపిరొదిలిన చిన్నారి, నాన్నా.. నాన్నా అంటూ తీవ్ర గాయాలను భరించలేక తల్లడిల్లుతున్న పసివాడిని చూస్తూ బ్రహ్మయ్య కొయ్యబారిపోయాడు. ఏం చేయాలో పాలుపోక గుండెలు బాదుకుంటూ అతడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment