కొల్హాపూర్: గణతంత్ర దినోత్సవాన సెలవు కావడంతో సరదాగా కుటుంబాలతో పిక్నిక్‌కు వెళ్తుంటే రోడ్డు ప్రమాదం రూపంలో ఆరుగురిని మృత్యువు కబళించింది. చెట్టుకు కారు ఢీకొన్న ఈ సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో శుక్రవారం జరిగింది. పూనె కేంద్రంగా నడుస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలోని ఉద్యోగులు తమ కుటుంబీకులతో రత్నగిరి ప్రాంతానికి పిక్నిక్‌కు కారులో వెళ్తున్నారు. అయితే వీరి కారు అదుపుతప్పి తలవాడె గ్రామం వద్ద చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుటుంబీకులు సహా ఆరుగురు వ్యక్తులు మృతిచెందారని షాహువాడి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్ గడే తెలిపారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాక మృతిచెందారన్నారు. సంతోష్ రావత్(37), అతని భార్య స్నేహాల్(32), వారి ఆరేళ్ల కుమారుడు స‍్వనంద, ప్రశాంత్ పతంకర్(40), కారు యజమాని దీపక్ షెల్‌కండే(40), అతని కుమారుడు ప్రణవ్(3)లు మృతిచెందారు. సంతోష్, ప్రశాంత్, దీపక్‌లు యార్డి సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగులని సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment