తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: ఖరీదైన సెల్ ఫోన్లే లక్ష్యంగా రాజమహేంద్రవరం నగరంలో ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. దేవాలయాలు, రైతు బజార్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్‌లు, సినిమా థియేటర్లు ఇలా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ ముఠాలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖరీదైన యాపిల్, శ్యామ్‌సంగ్ ఇతర కంపెనీల మొబైళ్లను చోరీ చేసి ముఠా సభ్యులు పరారవుతున్నారు. ఉదయం సమయంలో రద్దీగా ఉండే దేవాలయాలు, ఘాట్లు, రైతు బజార్లు, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్, మొయిన్‌రోడ్డు రద్దీ ప్రాంతాలను ఎంచుకొని జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు.గోకవరం,బిక్కవోలు, ఆకివీడు ప్రాంతాల నుంచి వచ్చిన తెలగపాముల ముఠాలు రాజమహేంద్రవరంలో సంచరించి ఖరీదైన సెల్‌ఫోన్‌లు చోరీలకు పాల్పడుతున్నాయి.
దానవాయి పేట ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగికి చెందిన రెండు సెల్‌ఫోన్లు ఈ మధ్య కాలంలో దేవాలయానికి వెళ్లినప్పుడు చోరీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో బిల్లు కలెక్టర్‌గా పని చేస్తున్న ఆర్.శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. లాలా చెరువులో మోటారు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని మోటారు సైకిల్ పడిపోతుందని అతడిని పక్కదారి పట్టించి అతడి జేబులో ఉన్న ఖరీదైన సెల్ ఫోన్‌ను చోరీ చేసి పరారయ్యారు. అల్లు రామలింగయ్య హోమియో కళాశాల ఎదురుగా చేపలు కొనుక్కునేందుకు వెళ్ళిన రాజేంద్ర నగర్‌కు చెందిన ఒక యువకుడి వద్ద పై జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ చోరీకి గురైంది. యువకుడు చేపలు అమ్మే వ్యక్తితో బేరమాడుతుండగా జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్‌ను ఎవరో చోరీ చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీకి గురవుతూనే ఉన్నాయి.
విలువైన సెల్ ఫోన్ల చోరీ..
ఈ ముఠా సభ్యులు ముఖ్యంగా కంపెనీ బ్రాండ్ సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్నారు. యాపిల్ బ్రాండ్ సెల్ ఫోన్ ధర సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. అలాగే ఇతర కంపెనీలకు చెందిన సెల్ ఫోన్‌లు రూ.60 వేలు, రూ.75 వేలు ఉంటాయి. వీటిని చోరీ చేసి సిమ్ కార్డును తీసివేసి ఇతర రాష్ట్రాలు ముంబయ్, కోల్‌కత్తా, హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్, విజయవాడ, నేపాల్ సరిహద్దులకు సెల్‌ఫోన్లు తరలించి అక్కడ విక్రయిస్తున్నట్టు పోలీసుల నిఘాలో తేలింది. ఇతర ప్రాంతాలకు సెల్‌ఫోన్లు తరలించడం వల్ల వీటిని రికవరీ చేయడం పోలీసులకు సా«ధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్లు పోయిన బాధితులు సాధారణంగా ఫిర్యాదులు చేయడం లేదు. వచ్చినా తక్కువ ఫిర్యాదులు మాత్రమే వస్తున్నాయి. దీంతో సెల్‌ఫోన్ చోరీలు నగరంలో విరివిగా సాగుతున్నాయి.
ఈజీ మనీకి అలవాటు పడి..
కొంత మంది యువకులు సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఖరీదైన సెల్ ఫోన్లు చోరీ చేసి వాటిని అమ్ముకోవడం ద్వారా తమ జల్సాలకు డబ్బులు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లయితే ఈజీగా చోరీ చేయవచ్చనే ఉద్దేశంతో ఈ బాట పట్టారు. చోరీ చేసిన వెంటనే దొంగలు వీటిని స్విచ్ ఆఫ్ చేస్తుండడంతో వారిని పట్టుకోవడంకష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment