బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
సాక్షి, తూర్పుగోదావరి(గొల్లప్రోలు) : పట్టణంలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. స్థానిక మార్కండేయపురంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు మాండపాక ప్రభాకరరావు ఇంట్లో సుమారు రూ.13లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు, విలువైన బాండ్లు, డాక్యుమెంట్లు అపహరణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండపాక ప్రభాకరరావు, అతడి భార్య వరలక్ష్మి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ప్రభాకరరావు ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో, వరలక్ష్మి గొల్లప్రోలులోని మలిరెడ్డి వెంకట్రాజు మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఉదయం యథావిధిగా ఇద్దరూ విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి , బీరువాలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న భర్త ప్రభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు.
ఇంటి వెనుక గోడ దూకి వచ్చి
చోరీకీ పాల్పడిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు బురద కాలితో ఉన్న ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఇంటి తాళం బద్దలు కొట్టి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి బీరువా తాళం తెరిచి అందులో ఉన్న వస్తువులను సోఫా, మంచంపై పేర్చి బాక్సుల్లో ఉన్న వస్తువులను చాకచక్యంగా అపహరించాడు.
రూ.13లక్షల విలువైన సొత్తు అపహరణ
43కాసుల బంగారు ఆభరణాలు, 57 తులాల వెండి వస్తువులతో పాటు రూ.20వేల నగదు చోరీకు గురైంది. వీటి విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన రూ.9.85 లక్షల విలువైన డిపాజిట్ బాండ్లు, రెండు స్థలాల డాక్యుమెంట్లు, భూమి డాక్యుమెంట్లు కూడా అపహరణకు గురయ్యాయి. క్రైమ్ పార్టీ, స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి, సమీప నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment