వివరాలు వెల్లడిస్తున్న తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు, చిత్రంలో నిందితులు
ఆ యువకులు చెడువ్యసనాలకు బానిసయ్యారు. చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టి.. చోరీ బాట పట్టారు. ఇప్పటికే పలు స్టేషన్లలో వారిపై కేసులు ఉండగా.. తాజాగా మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు.
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: రాత్రి సమయాల్లో కారు అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసి, వారి నుంచి 30 బ్యాటరీలు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ కారు స్వాధీనం చేసుకున్నట్టు అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. వాటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని, చోరీ చేసిన రూ.15వేల నగదును ఖర్చు పెట్టేశారని డీఎస్పీ తెలిపారు. బుధవారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన ఇలా వెల్లడించారు. రాజమహేంద్రవరం సుబ్బారావునగర్‌కు చెందిన తెలంశెట్టి సాయిభార్గవ్ అలియాస్ భార్గవ్, చౌడేశ్వరనగర్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు, సంజయనగర్‌కు చెందిన గెద్దాడ సునీల్‌కుమార్ అలియాస్ సునీల్, సంజీవనగర్‌కు చెందిన ఘంటసాల చిరంజీవి రాజేష్‌కుమార్ అలియాస్ రాజేష్‌లు చెడువ్యసనాలకు బానిసై చదువులను మధ్యలోనే నిలిపివేశారు. రాత్రి సమయాల్లో కారును అద్దెకు తీసుకుని రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్ దగ్గరలోని వీఎస్ గ్రానైట్స్‌కు చెందిన ఆఫీసురూమ్ పగలగొట్టి అందులో రూ.15వేల నగదు, ల్యాప్‌టాప్, ఆ పక్కనే పార్కు చేసి ఉంచిన లారీ, కారు బ్యాటరీలు చోరీకి చేశారన్నారు. దీనిపై బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై యూవీఎస్ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వారు దొంగిలించిన బ్యాటరీలను అమ్ముదామని లాలాచెరువు సంజయ్‌నగర్‌లో గెద్దాడ సునీల్ ఇంటి వద్ద అద్దెకు తీసుకున్న వెర్నా కారులో సర్దుతుండగా తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజుకు అందిన పక్కా సమాచారం మేరకు బుధవారం ఉదయం ఎస్సై నాగబాబు. తన సిబ్బందితో కలిసి నలుగురు నిందితులను అరెస్టుచేసి, కారుతో పాటు, వారు చోరీచేసిన 30బ్యాటరీలు(లారీలు,కారులు), ల్యాప్‌టాప్, కంప్యూటర్ మానిటర్, సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా వీఎస్‌గ్రానైట్స్‌తో పాటు, హోండా షోరూమ్ ఎదురుగా ఉన్న కారుషెడ్ తాళాలు పగలగొట్టి ఆరు కారుబ్యాటరీలు, దివాన్‌చెరువు శ్రీరామపురంరోడ్డులోని ఆగి ఉన్న లారీల ఆరు బ్యాటరీలు, బొమ్మూరు సుద్దగని వద్ద ఆగిఉన్న లారీల ఐదు బ్యాటరీలు, రాజమహేంద్రవరం జేఎన్‌రోడ్డులో రెండు బ్యాటరీలు, లాలాచెరువు శ్రీకృష్ణనగర్‌లో కంప్యూటర్, మోనిటర్, సీపీయూ, రెండుబ్యాటరీలు, సామర్లకోట పట్టణంలో ఏడుబ్యాటరీలో చోరీ చేసినట్టు తెలిపారన్నారు. నిందితుల్లో తెలంశెట్టి సాయిభార్గవ్ గతంలో బొమ్మూరు, ప్రకాష్‌నగర్, రాజానగరం పోలీస్‌స్టేషన్లలో బ్యాటరీల దొంగతనం కేసుల్లో, గెద్దాడ సునీల్‌కుమార్ తన స్నేహితులతో కలసి బలవంతగా డబ్బులు వసూలు చేసిన కేసు నమోదై ఉందన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment