
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , చేజర్ల: కుటుంబ వివాదం నేపథ్యంలో చిన్నాన్నపై అన్నకుమారుడు కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మడపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రమేష్‌బాబు కథనం మేరకు.. మడపల్లి గ్రామానికి చెందిన జువ్విగుంట పెంచల కొండయ్య మద్యానికి బానిసవగా, సంసారాన్ని నాశనం చేసుకోవద్దని అన్న జువ్విగుంట రమణయ్య తరచూ మందలిస్తుండేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మడపల్లి బస్టాండ్ సెంటర్‌లో పెంచలకొండయ్య మద్యం సేవించి ఉండగా అన్న మందలించడంతో దుర్భాషలాడాడు.
ఈ విషయం తెలుసుకున్న రమణయ్య కుమారుడు జువ్విగుంట బాబు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని చిన్నాన్నపై చాకుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలవగా పెంచలకొండయ్యను బంధువులు ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న కొండయ్యను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా బాబును అరెస్ట్ చేసే వరకు తాను స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. గంట సేపు నచ్చజెప్పిన పోలీసులు అతికష్టం మీద పోలీసు జీపులో పొదలకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.