ఆస్తికోసం.. అమ్మనే చంపేశాడు! | A Son Killed his Own Mother | Sakshi
Sakshi News home page

ఆస్తికోసం.. అమ్మనే చంపేశాడు!

Published Thu, May 3 2018 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

A Son Killed his Own Mother - Sakshi

రక్తపుమడుగులో భాగ్యమ్మ, విజయ్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌: కన్నతల్లి అనే కనికరం లేదు.. ఆస్తి కోసం ఏకంగా అమ్మ ప్రాణాలనే తీశాడో కొడుకు.. కుమారుల బారి నుంచి తప్పించుకునేందుకు సొంతూరు వదిలి హైదరాబాద్‌ వచ్చింది ఆ అభాగ్యురాలు. అయినా సరే ఆమె ఎక్కడుందనే విషయం కనుక్కుని మరీ వచ్చి ఆమెను కడతేర్చాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్‌ మండలం మద్దికేర్‌కు చెందిన భాగ్యమ్మ(55)కు ముగ్గు్గరు కొడుకులు, ఓ కూతురు. భాగ్యమ్మ భర్త రామాంజనేయులు రైల్వేలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. 20 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. 

ఆస్తి కోసం వేధింపులు.. 
రామాంజనేయులు పేరుపై పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిని పంచివ్వాలని కొడుకులు సురేశ్, కిరణ్, విజయ్‌ తల్లిని వేధించసాగారు. తండ్రి చనిపోయి నెల రోజులైనా గడవకముందే ఆస్తులు పంచమని వేధించడం సరికాదని భాగ్యమ్మ కొడుకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే తాము చెప్పినట్లు వినడం లేదని తల్లిపై ముగ్గురు కుమారులు కోపం పెంచుకున్నారు. భాగ్యమ్మ వద్ద ఉన్న బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, పెన్షన్‌ కాగితాలను లాగేసుకున్నారు. బ్యాంక్‌లో నుంచి డబ్బులు తీసుకురావాలని పెద్దకొడుకు సురేశ్‌ ఇటీవల ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో డబ్బుల కోసం అవసరమైతే తనను చంపుతారని భావించిన భాగ్యమ్మ వారి నుంచి తప్పించుకుని నాలుగు రోజుల క్రితం నగరంలోని బల్కంపేట దాసారం బస్తీలో ఉంటున్న సోదరి వీరమ్మ వద్దకు వచ్చి తలదాచుకుంది. 

అడ్రస్‌ కనుక్కుని వచ్చి మరీ.. 
భాగ్యమ్మ ఎక్కడ ఉందనే విషయం తెలుసుకున్న చిన్నకొడుకు విజయ్‌ దాసారం బస్తీలోని వీరమ్మ ఇంటికి వచ్చాడు. బుధవారం ఉద యం వీరమ్మ పనికి వెళ్లగా ఆమె కోడలు చిట్టెమ్మ ఆరు బయట బట్టలు ఉతుకుతోంది. నేరుగా ఇంట్లోకి వెళ్లిన విజయ్‌ తల్లితో గొడవకు దిగాడు. తలుపులు మూసేయడంతో లోపలి నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చిట్టెమ్మ తలుపులు తెరవాలని అరుస్తున్నా వినిపించుకోలేదు. చుట్టుపక్కల వారు ఇనుప కడ్డీలతో డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో విజయ్‌ రోకలి బండతో భాగ్యమ్మ తలపై బలంగా బాదడంతో కుప్పకూలిపోయింది. అనంతరం తలుపు తెరిచి బయటకు వచ్చిన విజయ్‌.. తన తల్లిని చంపేశానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారిని నెట్టిసి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆర్థిక వివాదాలే హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్థారించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా విజయ్‌ కర్నూల్‌ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement