
నాగరాజు, రాఘవమ్మ (ఫైల్)
ఏ.సీతారామపురం (హనుమాన్‌జంక్షన్ రూరల్): ఆస్తి కోసం కన్న తల్లినే కొట్టి చంపాడు ఓ కసాయి కొడుకు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఏ.సీతారామపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ గజ్జెల నాగరాజు.. ఏడాది క్రితం భార్య అనారోగ్యంతో చనిపోవడంతో కుమార్తె (12), కుమారుడు (10)తో కలసి కొంతకాలంగా తల్లి రాఘవమ్మ (55) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగరాజుకు అప్పుల బాధ అధికమవటం, వ్యసనాలకు బానిసగా మారటంతో తల్లి పేరిట ఉన్న 7 సెంట్ల ఇళ్ల స్థలం అమ్మి డబ్బు ఇవ్వాలని తరచూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. దీనికి రాఘవమ్మ ససేమిరా అనటంతో తల్లి, కొడుకుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఆస్తి విషయమై ఆదివారం ఉదయం రాఘవమ్మ, కొడుకు నాగరాజు మధ్య వివాదం చోటు చేసుకోవటంతో తీవ్ర ఆగ్రహంతో తల్లిపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో రాఘవమ్మ ఆపస్మారక స్ధితిలోకి వెళ్లింది. రాఘవమ్మ అరుపులు విని ఇరుగుపొరుగు రావటంతో నాగరాజు అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న రాఘవమ్మను స్థానికులు చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గజ్జెల నాగరాజు పరారీలో ఉండటంతో గాలింపు చేపట్టారు.