చికిత్స పొందుతున్న యల్లమ్మ
వైఎస్‌ఆర్ జిల్లా, రైల్వేకోడూరు రూరల్ : అన్యోన్యంగా ఉన్న కాపురంలో అనుమానాలు రేకిత్తించాయి. రోజూ మద్యం తాగివచ్చి భార్యను వేధించడం, కొట్టడం పరిపాటిగా మారింది. అడ్డొచ్చిన అత్తపై అల్లుడు రోకలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రైల్వేకోడూరు మండల పరిధిలోని జింపెక్స్ ముగ్గురాయి మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. గుంతకల్లుకు చెందిన ఓబులేసు పదేళ్ల సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రైల్వేకోడూరుకు వచ్చి జింపెక్స్ ముగ్గురాయి మిల్లులో పనిచేస్తున్నాడు.
అక్కడే సమీపంలో గుడిసె వేసుకుని తలదాచుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన, బంధువు యల్లమ్మ కుమార్తె సుదమ్మతో ఓబులేసుకు వివాహం అయ్యింది. భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. మంగళవారం కూడా మద్యం తాగివచ్చి భార్యను కొడుతుండగా అత్త యల్లమ్మ అడ్డుపడింది. నాకే అడ్డు చెబుతావా నీ అంతు చూస్తా, అంటూ రోకలితో అత్తపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన యల్లమ్మను పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment