వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సీహెచ్ విజయారావు
గుంటూరు: అర్బన్ జిల్లా పరిధిలో నేరాలు జరుగకుండా చూడడమే తమ లక్ష్యమని, నేరాలకు పాల్పడే వారిని అష్టదిగ్బంధనం చేస్తామని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం తెల్లవారు జామున నగరంలోని కేవీపీ కాలనీ, కేఎస్ కాలనీ, స్వర్ణభారతి నగర్, దాసరిపాలెం, మహానాడు కాలనీల్లో పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 125 వాహనాలను సీజ్ చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. మొదటి విడతగా సమస్యాత్మక ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జిల్లాలోకి వచ్చి ఉంటున్న 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 90 ద్విచక్రవాహనాలు, 28 ఆటోలు, కారు, ట్రాక్టర్‌ను కూడా సీజ్ చేశామని స్పష్టం చేశారు.
భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో తమ బలగాలు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ సమర్ధంగా తనిఖీలు పూర్తిచేశారన్నారు. సరైన ఆధారాలు చూపితే వాహనాలు తిరిగి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణ కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వివరించారు. భవిష్యత్తులో కూడా కార్డన్ సెర్చ్ కార్యక్రమం కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రజలు ఏర్పాటు చేసుకుంటే చోరీలు జరిగే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే 1200 నివాసాలకు ఏర్పాటు చేశామని, అక్కడ ఎలాంటి చోరీలు జరగలేదని చెప్పారు. నగరంలో వంద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిరంతరం తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వైటీ నాయుడు, డీఎస్పీలు జి.రామాంజనేయులు, మూర్తి, కేజీవీ సరిత, కె.శ్రీనివాసులు, వెంకటరెడ్డి, పాపారావు, రమేష్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment