న్యూఢిల్లీ: అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ ఆలయంలో బంధించి ఎనిమిది రోజులపాటు గ్యాంగ్ రేప్ చేసి చివరికి కొట్టిచంపేసిన దారుణ ఘటన దేశాన్ని కదిలిస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ‘మోదీ.. మాట్లాడు’ అంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లా హీరానగర్ మండల పరిధిలోని రస్సానాలో ఆసిఫా అనే ఎనిమిదేళ్ల బాలిక హత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది.
అన్ని మాట్లాడతారుగా ఇప్పుడేమైంది మోదీజీ?: ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీ మౌనం ఏమాత్రం అంగీకారం కాదు. చిన్నపిల్లలు, మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దురాగతాల గురించి మీరేమనుకుంటున్నారు? దారుణాలకు పాల్పడిన నిందితులకు ప్రభుత్వాలు అండగా నిలవడం ఎంతవరకు సమంజసం?’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మరో అడుగు ముందుకేసి మోదీని తూర్పారబట్టారు. ‘‘మన్‌కీ బాత్ అనో, ఇంకో పేరుతోనో నిత్యం మీ ఆలోచనలను, మాటలను దేశ ప్రజలతో పంచుకుంటారే.. మరి ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా చిదిమేస్తే, నిందితులను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కాపాడుతుంటే మీరు నోరు తెరవకపోవడం ఏమైనా బాగుందా? ఎప్పుడూ మీకు అవసరమైన విషయాలమీదే మాట్లాడతారా? ఇతరులకు అత్యవసరమైన విషయాలమీద నోరు మెదపరా?’’ అని అబ్దుల్లా ఫైరయ్యారు.
అసలేం జరిగింది?: జనవరి 11న కథువాకు చెందిన ముస్లిం బాలిక ఆసిఫా(8) ఇంటి పరిసరాల్లో గుర్రాలను మేపుతుండగా అదృశ్యమైంది. పాప తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జనవరి 17న సమీపంలోని అడవిలో పాప మృతదేహం దొరికింది. బాలికకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సాంజీరామ్.. ఆసిఫాపై అత్యాచారం చేయాలంటూ తన కుటుంబీకులను ఉసిగొల్పాడు. బాలికను క్రూరమృగాలకంటే దారుణంగా చిదిమేసినవారిలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. సాంజీరామ్‌కే చెందిన ఆలయంలో పాపను బంధించి మత్తుమందు ఇస్తూ ఒకరితర్వాత మరొకరు అత్యాచారం చేశారు. తొలుత సాంజీరామ్ మేనల్లుడు, వాడి స్నేహితుడు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరట్(యూపీ) నుంచి వచ్చిన సాంజీరామ్ కుమారుడు విశాల్, పోలీసు అధికారి దీపక్ ఖజూరియా, మరో ఇద్దరు స్పెషల్ పోలీసులూ చిన్నారిపైకి ఎగబడ్డారు. చివరికి జనవరి 14న సాంజీ మేనల్లుడు.. పాపను కర్రతో కొట్టి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిదితులుగా చేర్చారు.
ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు.. : ఆసిఫాపై అకృత్యానికి కొద్దిరోజుల ముందు కథువా గ్రామంలో నివసిస్తోన్న బకర్వాల్ వర్గానికి చెందిన ముస్లింలను అక్కడి నుంచి తరిమేయాలని గ్రామపెద్దలు తీర్మానించారు. ముస్లింలు గోవధ, డ్రగ్స్ స్మగ్లింగ్ తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దానివల్ల తమ పిల్లలు చెడిపోతున్నారన్నది గ్రామపెద్దల ఆలోచన. ఈ క్రమంలోనే ముస్లిముల గుర్రాలను పొలాల్లో మేపనివ్వరాదని, వాళ్లకు భూములు సైతం అమ్మకూడదని సాంజీరామ్, ఇంకొందరు సూచనలు చేశారు. తీర్మానాలు జరిగిన కొన్ని గంటలకే.. తన ఇంటి బయట గుర్రాలను మేపుతున్న ఆసిఫా అపహరణకు గురైంది.
Comments
Please login to add a commentAdd a comment