కిడ్నీ రాకెట్‌ గుట్టు వీడేనా..? | Sraddha Hospital Kidney Racket Case Still Pending | Sakshi
Sakshi News home page

కిడ్నీ రాకెట్‌ గుట్టు వీడేనా..?

Published Wed, May 15 2019 12:42 PM | Last Updated on Sat, May 25 2019 12:22 PM

Sraddha Hospital Kidney Racket Case Still Pending - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్‌లో మంగళవారం మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రద్ధ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌/ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) జె.కె.వర్మను పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే వర్మతో పాటు శ్రద్ధ ఆస్పత్రి నెఫ్రాలజీ వైద్యుడు డాక్టర్‌ దొడ్డి ప్రభాకర్, బెంగళూరుకు చెందిన బ్రోకర్, ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి ఎండీ ప్రదీప్, కిడ్నీ మార్పిడి జరిగిన రోగి బీఎస్‌ ప్రభాకర్, అతని సోదరుడు వెంకటేశ్‌లను అరెస్టు చేయాల్సి ఉంది. వైద్యుడు ప్రభాకర్‌తో సత్సంబంధాలుండడమే గాక, కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో లావాదేవీలు నిర్వహించడంలోనూ వర్మ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు.

వర్మ వెల్లడించే సమాచారమే కీలకం
శ్రద్ధ ఆస్పత్రిలో ఏటా 10 నుంచి 12 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టు లెక్క తేల్చారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.60 నుంచి రూ.70 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఏడాదికి ఏడెనిమిది కోట్ల రూపాయల మేర కిడ్నీల వ్యాపారం సాగిస్తున్నారన్న మాట! కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించి అవసరమైన పత్రాలు తయారు చేయడం, బ్రోకర్లతో మంతనాలు సాగించడం, కిడ్నీ ఇచ్చిన వారికిచ్చే సొమ్ముపై బేరసారాలు, సొమ్ము చెల్లింపులు వంటివన్నీ వర్మే చూసుకుంటారని ఇప్పటికే పోలీసులు నిర్థారణకు వచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కేసును దర్యాప్తు చేస్తున్న మహారాణిపేట పోలీసు అధికారులు తొలుత జేకే వర్మను కస్టడీకి ఇవ్వాలని కోరారు. కోర్టు అనుమతించడంతో మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వర్మను విచారించనున్నారు. దీంతో ఈ కేసులో వర్మ ఇచ్చే సమాచారమే కీలకం కానుంది. అయితే రెండు రోజుల కస్టడీలో వర్మ పోలీసులకు కిడ్నీ గుట్టు విప్పుతాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వర్మ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంకెవరిని కస్టడీకి తీసుకోవాలన్న దానిపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు శ్రద్ధ ఆస్పత్రి ఎండీ ప్రదీప్‌ పరారీలో ఉన్నారు. సాక్షి పత్రికలో కిడ్నీ రాకెట్‌ కథనం ప్రచురితమైనప్పటి నుంచీ ఆయన పత్తా లేకుండా పోయారు. మహారాణిపేట పోలీసులు ప్రదీప్‌ కోసం గాలిస్తున్నారు.

రెండో రోజు కమిటీ కసరత్తు
మరోపక్క కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు రెండో రోజు దర్యాప్తులో భాగంగా కసరత్తు కొనసాగించారు. శ్రద్ధ ఆస్పత్రితో పాటు కిడ్నీ/అవయవ మార్పిడి అనుమతులు పొందిన ఆస్పత్రుల నుంచి ఏ సమాచారం రాబట్టాలన్న దానిపై ప్రశ్నావళిని రూపొందించారు. అవయవ/కిడ్నీ దాతలు ఎవరు? తీసుకున్నదెవరు? జీవన్‌దాన్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి ఎన్ని చేశారు? ఎన్టీఆర్‌ వైద్యసేవలో ఎన్ని మార్పిడిలు చేశారు? ఇందుకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతులు తీసుకున్నారా? లేదా? వంటి ప్రశ్నలను అందులో పొందుపరిచారు. బుధవారం వీరు శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించి మరిన్ని రికార్డులను తనిఖీ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను కూడా కలిసి వీరికి అవసరమైన సమాచారాన్ని తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement