తన కుమారుడిని విచక్షణారహితంగా కొట్టారని విలపిస్తున్న తల్లి
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్న ఘాతుకం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారంటూ యశ్వంత్‌తోపాటు మరికొంత మంది విద్యార్థులను ప్రిన్సిపాల్, లెక్చరర్లు కొంతకాలంగా హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం టిప్పర్ల బజార్‌లో ఓ కారు అద్దాలు పగిలితే దానికి కారణం యశ్వంత్ అని యశ్వంత్‌ను శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ హింసించాడు. అది తట్టుకోలేని యశ్వంత్ బయటకు వెళ్లి నిద్రమాత్రలు తెచ్చుకుని మింగి నిద్రపోయాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ వెంటనే తమ కళాశాలలో విద్యార్థులు మత్తుపదార్థాలు తీసుకున్నారని పోలీసులకు సమాచారమిచ్చాడు.
పోలీసులు యశ్వంత్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఉన్న రూమ్‌లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయబోగా వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కళాశాల సిబ్బంది యశ్వంత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన యశ్వంత్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యశ్వంత్ తల్లి మస్తానమ్మకు కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, మీ కుమారుడు కాలేజీలో నిద్రపోతున్నాడని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు.
కంగారు పడిన మస్తానమ్మ భర్తను వెంటపెట్టుకుని కళాశాలకు రాగా అప్పటికే విద్యార్థులను పోలీసులు తీసుకెళ్తుండడం చూసి, అడ్డుపడింది. అయినా పట్టించుకోకుండా పోలీసులు విద్యార్థులను స్టేషన్‌కు తరలించారు. తమ తోటి విద్యార్థులను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడాన్ని చూసి ఆగ్రహించిన ఇతర విద్యార్థులు కళాశాల ఆద్దాలు పగలకొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించామని పట్టణ సీఐ నరేష్‌కుమార్ చెప్పారు. పోలీసులు ఎవరినీ కొట్టలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment