Sri Chaitanya Junior College
-
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్ఆర్డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్! -
పక్కదారి పడుతున్న పోలీసుల దర్యాప్తు !
సాక్షి, మంగళగిరి : పట్టణంలోని టిప్పర్ల బజార్లో గల శ్రీ చైతన్య కళాశాలలో ఈనెల 1న విద్యార్థులకు, లెక్చరర్లకు జరిగిన వివాదంలో పోలీసులు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, గంజాయి తీసుకున్నారనే సమాచారం మేరకు కళాశాలలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఐదుగురుని అదుపులోకి తీసుకుని వారి రక్త నమూనాలను సేకరించారు. కళాశాలలో ఇంటర్ విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారంటే యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు. అసలు కళాశాలకు మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా విద్యార్థులు, తల్లితండ్రులును అరెస్ట్ చేసి జైలుకు పంపడం విమర్శలకు తావిస్తోంది. శ్రీ చైతన్య కళాశాలలో పని చేస్తున్న లెక్చరర్ తమను హింసిస్తున్నారని అదే రోజు విద్యార్థులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే లెక్చరర్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఒక విద్యార్థి తల్లితండ్రులతో పాటు మరో ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం విశేషం. చర్చనీయాంశంగా మారిన అరెస్టులు కళాశాలలో చదివే విద్యార్థి మత్తు పదార్థాలకు బానిస అవడంతో పాటు తోటి విద్యార్థుల్ని బానిసలుగా మార్చడంతో పాటు తనపై హత్యాయత్నం చేశాడని, దీనికి విద్యార్థి తల్లితండ్రులు సహకరించారని లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 9న పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అసలు కళాశాలకు మత్తు పదార్థాల సరఫరా ఎలా జరిగింది? లెక్చరర్‌ను హత్య చేసే అవసరం విద్యార్థికి ఎందుకొచ్చింది? అనేది పట్టించుకోకుండా మైనర్ విద్యార్థులను జైలుకు పంపడం చర్చనీయాంశంగా మారింది. శ్రీ చైతన్య యాజమాన్యం ఒత్తిడికి లొంగి పోలీసులు విద్యార్థులు, తల్లిదండ్రులను జైలుకు పంపారనే చర్చ జరుగుతోంది. కళాశాల యాజమాన్యం తమను వేధిస్తోందని, లెక్చరర్ మరీ వేధింపులకు గురి చేస్తున్న కారణంగానే తట్టుకోలేక తిరగబడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు మైనర్లు ఉండటం విశేషం. విద్యార్థులు తప్పు చేసి ఉంటే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మంచి దారిలో నడిచేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవేవి కాకుండా ఏకపక్షంగా విద్యార్థులు, తల్లితండ్రుల్ని పోలీసులు జైలుకు పంపి కళాశాల యాజమాన్యానికి సహకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాజమాన్యానికి సహకరిస్తున్న పోలీసులు ? శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో ఏమి జరిగినా, అక్కడే పని చేసే నిర్వాహకులు విద్యార్థుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదు. చివరికి విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందన లేదు. పోలీసు యంత్రాంగం ఆయా కళాశాలల యాజమాన్యాలకు సహకరిస్తున్న కారణంగానే విద్యార్థులు గానీ తల్లిదండ్రులు గానీ అక్రమాలను ప్రశ్నించలేకపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన విద్యార్థులతో పాటు తల్లితండ్రులను జైలుకు పంపిన పోలీసులు.. అసలు కళాశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల సరఫరాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణమైన కళాశాలలు, యూనివర్సిటీల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలలపై చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రీచైతన్య కళాశాల విద్యార్థికి వేధింపులు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్లో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్న ఘాతుకం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారంటూ యశ్వంత్‌తోపాటు మరికొంత మంది విద్యార్థులను ప్రిన్సిపాల్, లెక్చరర్లు కొంతకాలంగా హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం టిప్పర్ల బజార్లో ఓ కారు అద్దాలు పగిలితే దానికి కారణం యశ్వంత్ అని యశ్వంత్‌ను శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ హింసించాడు. అది తట్టుకోలేని యశ్వంత్ బయటకు వెళ్లి నిద్రమాత్రలు తెచ్చుకుని మింగి నిద్రపోయాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ వెంటనే తమ కళాశాలలో విద్యార్థులు మత్తుపదార్థాలు తీసుకున్నారని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు యశ్వంత్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఉన్న రూమ్‌లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయబోగా వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కళాశాల సిబ్బంది యశ్వంత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన యశ్వంత్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యశ్వంత్ తల్లి మస్తానమ్మకు కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, మీ కుమారుడు కాలేజీలో నిద్రపోతున్నాడని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. కంగారు పడిన మస్తానమ్మ భర్తను వెంటపెట్టుకుని కళాశాలకు రాగా అప్పటికే విద్యార్థులను పోలీసులు తీసుకెళ్తుండడం చూసి, అడ్డుపడింది. అయినా పట్టించుకోకుండా పోలీసులు విద్యార్థులను స్టేషన్‌కు తరలించారు. తమ తోటి విద్యార్థులను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడాన్ని చూసి ఆగ్రహించిన ఇతర విద్యార్థులు కళాశాల ఆద్దాలు పగలకొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించామని పట్టణ సీఐ నరేష్కుమార్ చెప్పారు. పోలీసులు ఎవరినీ కొట్టలేదని అన్నారు. -
విద్యార్థులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
సాక్షి, కరీంనగర్ : ఓటు హక్కు కలిగిన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని శ్రీచైతన్య జూనియర్ కళాశాల చైర్పర్సన్ శ్రీలత పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్‌నగర్ నుంచి బస్టాండ్ వరకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ నమూనా తీరును, ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పవన్‌కుమార్, ఎండీ.సత్తార్, ప్రిన్సిపాల్ శ్రీకన్య, సరస్వతి, నిరూష, తేజస్విని, భవాని తదితరులు పాల్గొన్నారు. -
భవనంపై నుంచి దూకిన శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని
హైదరాబాద్: కళాశాల యాజమాన్యం వేధింపులకు మరో విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కళాశాల మూడవ అంతస్తు నుంచి కిందకు దూకినా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సెల్‌ఫోన్ తీసుకు వచ్చిందన్న నెపంతో అవమానపాలు చేసిన అధ్యాపకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కళాశాల భవనంపై నుంచి కిందకు దూకిన సంఘటన కలకలం రేపింది. వివరాలు.. కుత్భుల్లాపూర్ సర్కిల్ ఐడీపీఎల్ చౌరస్తా సమీపంలోని ఏపీహెచ్‌బీ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రోడామేస్త్రీ నగర్‌కు చెందిన ఎండీ ముస్కాన్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కొంతమంది విద్యార్థులు దొంగచాటుగా సెల్ఫోన్లు తమ వెంట తీసుకువస్తున్నారని గ్రహించిన అధ్యాపక బృందం విద్యార్థునులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలువురి వద్ద మొబైల్ ఫోన్లు లభించాయి. విద్యార్థిని ముస్కాన్ వద్ద కూడా ఫోన్‌ను లాక్కున్నారు. దీనిని అవమానభారంగా భావించిన ముస్కాన్ అకస్మాత్తుగా మూడవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని విద్యార్థులు అధ్యాపకులకు తెలపగా హుటాహుటిన విద్యార్థినిని స్థానికంగా ఉన్న సంధ్య ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి తీవ్రంగా ఉండటంతో బాలానగర్‌లోని బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కళాశాల డీన్ నాగేశ్వర రావును వివరణ కోరగా ఈ విషయంలో కళాశాల సిబ్బంది తప్పులేదని, రోజువారీ తనిఖీల్లో భాగంగానే సోదాలు నిర్వహించామని, విద్యార్థిని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అనుమానాలెన్నో.. మొబైల్ విషయంలోనే అవమానంగా భావించి ముస్కాన్ మూడవ అంతస్తు నుంచి దూకిందని కళాశాల ప్రతినిథులు చెబుతుండగా..మరో వైపు సిబ్బంది మాత్రం ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి వెళ్లే క్రమంలో విద్యార్థులు ఒకరికొకరు తోసుకోవడంతో మెట్లపై నుంచి జారిపడిందని చెబుతున్నారు. ఇదే విషయమై ముస్కాన్ సోదరుడు జుబేర్‌ను ‘సాక్షి’ అడుగగా..మా చెల్లెలికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మొబైల్ కూడా ఆమె వద్ద లేదని పేర్కొంటున్నాడు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్, రాష్ట్ర కన్వీనర్ బక్క శంకర్ రెడ్డిలు బీజేవైఎం నాయకులతో కలిసి కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. కార్పొరేట్ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. -
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్షకు..
ఘట్‌కేసర్‌టౌన్: ఓ పక్క ఇంటిలో తండ్రి శవం.. మరో పక్క పరీక్ష కేంద్రంలో కూతురు.. ఈ హృదయవిదారక దృశ్యం మండలంలోని యంనంపేట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆరముల్ల శ్రీనివాస్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశాడు. శ్రీనివాస్ భార్య 12 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరి ఏకైక కుమార్తె లావణ్య. తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ అన్నీ తానై లావణ్యను పెంచుతున్నాడు. ఇప్పుడు తండ్రి మృతితో రెక్కలు తెగిన పక్షిలా అయింది లావణ్య. ఘట్కేసర్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న లావణ్య బుధవారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దుఃఖాన్ని దిగమింగుకొని బంధువుల సహకారంతో అన్నోజీగూడ నారాయణ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది. అనంతరం తలకొరివి పట్టి తండ్రి చితికి నిప్పంటించింది. -
ఉపాధ్యాయులు మందలించారని...
హైదరాబాద్: మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించడంతో భవనంపై నుంచి దూకి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి కుమార్తె రాజేశ్వరి బాచుపల్లిలోని పూజిత ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న ఇంటర్ పరీక్షల్లో రాజేశ్వరి మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో విద్యార్థిని భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసింది. వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. తండ్రి రాజిరెడ్డి రాగానే కుమార్తెను అప్పగించినట్లు సమాచారం. అయితే రాజేశ్వరికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
శ్రీచైతన్యకు షోకాజు నోటీసు జారీ
నెల్లూరు (టౌన్): నగరంలోని ఇస్కాన్‌సిటీలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌కు ఎదురు మాట్లాడాడని విద్యార్థి దుంపా పృధ్వీసాయికుమార్‌ను యాజమాన్యం కొట్టడంపై ఆర్ఐఓ బాబూజాకబ్ స్పందించారు. శుక్రవారం కళాశాలకు వెళ్లి విచారించారు. తొలుత విద్యార్థి పృధ్వీసాయికుమార్‌ను పిలిచి కొట్టడంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, క్యాంపస్ ఇన్చార్జి శివను పిలిచి విచారణ చేపట్టారు. విద్యార్థిని కొట్టారని తేలడంతో యాజమాన్యానికి షోకాజు నోటీసు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ పంపాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రిన్సిపల్ వెంకట్, క్యాంపస్ ఇన్చార్జి శివను అక్కడి నుంచి పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ బాబూజాకబ్ మాట్లాడుతూ విద్యార్థులను కొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. కళాశాల యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే తరగతులు నిర్వహించాలన్నారు. అంతకంటే ఎక్కువ సమయంలో క్లాసులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి నెల్లూరు (టౌన్): విద్యార్థి పృధ్వీసాయికుమార్‌ను తీవ్రంగా కొట్టిన శ్రీచైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అంజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టోన్‌హోస్‌పేటలోని ఆర్ఐఓ కార్యాలయంలో ఆర్ఐఓ బాబూజాకబ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. హోంవర్క్ రాయలేదని బాత్రూంలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విద్యార్థిని కళాశాల యాజమాన్యం బెదిరిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అర్జున బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘శ్రీచైతన్య’పై ప్రైవేటు కేసు
కర్నూలు(లీగల్): ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్ నుంచి గెంటివేయడంపై కర్నూలు కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. ఇందులో కళాశాల యాజమాన్యానికి సహకరించిన పోలీసులపైనా మరో ఫిర్యాదు దాఖలైంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేతంచర్లకు చెందిన డి.ఎల్.ఎన్.శాస్త్రి కుమార్తె కర్నూలు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేది. ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో 2014 ఏప్రిల్ 8న అర్ధరాత్రి కళాశాల యాజమాన్యం హాస్టల్ నుంచి గెంటేసింది. అప్పట్లో ఆ విద్యార్థిని తండ్రి కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కళాశాల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సదరు కేసు దర్యాప్తు చేయాలని కర్నూలు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ కేసులో పోలీసు అధికారులు ఫిర్యాది, బాధితురాలిని విచారించకుండానే తప్పుడు కేసంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో ఫిర్యాది తిరిగి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు. శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం, కర్నూలు పోలీసులపై చర్యలు చేపట్టి.. తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు ఈనెల 25న విచారణకు రానున్నట్లు ఫిర్యాది తెలిపారు. -
డీన్, ప్రిన్సిపల్ వేధిస్తున్నారు...
కళాశాల వద్ద మహిళ ప్రిన్సిపల్, లెక్చరర్ల ఆందోళన హిమాయత్‌నగర్: నారాయణగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో తమను వేధిస్తున్నారని మహిళా ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు జూనియర్ లెక్చరర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎల్ఎస్, టీఎస్ఎల్, టీసీఈపీఎస్ నాయకులు మద్దతుగా నిలిచి డీన్, ప్రిన్సిపల్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం... నారాయణగూడలోని చైతన్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లుగా ప్రవీణ్, మధు, శ్రీనివాస్, రాజేష్ పని చేస్తున్నారు. వీరిని కొంతకాలంగా డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు పలు రకాలుగా వేధిస్తున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిర్మయిని డీన్ కుమార్, తోటి ప్రిన్సిపల్ స్వామిరావు, ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమెను ఏదో ఒక కారణంతో తరచూ వేరే క్యాంపస్‌లకు బదిలీ చేస్తున్నారు. వారం క్రితం కెమిస్ట్రీ లెక్చరర్ ప్రవీణ్‌కు కుమారుడు పుట్టడంతో యాజమాన్యం అనుమతితో మూడు రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. నాలుగో రోజు కళాశాలకు వచ్చిన ప్రవీణ్‌ను ప్రిన్సిపల్ స్వామిరావు.. ‘ఎందుకు వచ్చావ్..కాలేజీ నుంచి పొమ్మని’ దుర్భాషలాడాడు. దీంతో బాధితుడు టీఆర్ఎల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, టీసీపీఎఫ్ చైర్మన్ సునీల్‌కుమార్, టీఎల్ఎస్ అధ్యక్షుడు మహేందర్లను ఆశ్రయించాడు. దీంతో బాధిత లెక్చరర్లకు మద్దతుగా వీరంతా శుక్రవారం కళాశాలలో ఆందోళన చేపట్టారు. సుమారు గంటన్నరపాటు కళాశాల యాజమాన్యానికి వీరికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లు తమపై చేసిన ఆరోపణలను డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు ఖండించారు. తాము ఎవరినీ ఏ విధంగా వేధించడంలేదన్నారు. పర్మిషన్ తీసుకుండా సెలవులు తీసుకోవడంపై ప్రశ్నించినందుకు తమపై తప్పుడు ఆరోపణలు, చేసి దాడికి యత్నించారన్నారు. -
ఐఐటీ ప్రవేశ పరీక్షలో మెరుపులు
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక ఐఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో జిల్లా విద్యార్థులు పలువురు మంచి ర్యాంక్‌లు సాధించారు. గురువారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. పట్టణానికి చెందిన వర్రి ఆదిత్యవర్ధన్ (శ్రీచైతన్య జూనియర్ కళాశా ల) జాతీయ స్థాయిలో 17వ ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 2వ ర్యాంక్ సాధించాడు. అదే విద్యాసంస్థకు చెందిన పలువురు జిల్లా విద్యార్థులు పలు మంచి ర్యాంక్‌లు సాధించారు. వారిలో దంతులూరి శ్రీకర్ వర్మకు 785వ ర్యాంక్, బులుసు భానుమిత్రకు 1,474వ ర్యాంక్, బాడంగి మండలం వాడాడ కు చెందిన గొట్టాపు శ్రావణ్‌కుమార్‌కు 2,299వ/ఓబీసీ-282వ ర్యాంక్, ఐ.అనుదీప్‌కు 2,683వ ర్యాంక్, శంబంగి శ్రీచైతన్యకు 4,643వ ర్యాంక్, బొట్టు వంశీకి 9,769వ ర్యాంక్‌లు లభించాయి. సివిల్స్ లక్ష్యం : వర్రి ఆదిత్యవర్ధన్ దేశంలో ఉత్తమ సేవలను అందించగల ప్రతిష్టాత్మకత సివిల్స్ లక్ష్యంగా ఉన్నత చదువుల్లో కృషి చేస్తానని 17వ ర్యాంకు సాధించిన వర్రి ఆదిత్యవర్ధన్ ఫోన్లో వివరించాడు. ముంబై ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో చేరి అత్యున్నత ప్రమాణాల ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తానని. అదే సమయంలో దేశంలో అత్యన్నత స్థాయి పరీక్ష అయిన సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధన లక్ష్యంగా కృషి చేస్తానని చెప్పాడు. ఆదిత్యవర్ధన్ తండ్రి వర్రి మహేష్ విశాఖ సాంఘిక సంక్షేమ కళాశాలలో అధ్యాపకులు. తల్లి శ్రీదేవి పూసపాటిరేగ మండలంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో 336/360 మార్కులు సాధించి ఉత్తరాంధ్రలో ప్రథముడిగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన విట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఎంసెట్‌లో 5వ ర్యాంక్ సాథించి జిల్లా పేరు రాష్ట్రస్థాయిలో నిలబెట్టాడు. ఐఐటీ ర్యాంక్ విషయూన్ని తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు స్థానిక పద్మావతినగర్ కాలనీల్లో ఆనందోత్సాహంలో మునిగారు. మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు మిఠాయి పంచుకున్నారు. లోకేష్‌కు 138వ ర్యాంకు బెలగాం: ఐఐటీ(జేఈఈ) ఫలితాల్లో గరుగుబిల్లి మండలం బురదావెంకటాపురానికి చెందిన విద్యార్థి లోకేష్ కుమార్ సత్తా చాటాడు. ఓబీసీలో 138వ ర్యాంక్ సాధించాడు. లోకేష్ తండ్రి బొత్స పరిశినాయుడు శ్రీకాకుళంలోని సర్వే , భూమి రికార్డులు శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తల్లి సుగుణ గృహిణి. లోకేష్ ఐఐటీ మెయిన్స్‌లో సైతం 289 మార్కులు సాధించి ఎన్ఐటీఎస్లో ప్రవేశ అర్హత సాధించాడు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో 351 మార్కులు , వీఐటీ-2104 లో 366ర్యాంకు సాధించాడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటస్టిక్స్ (ఐఎస్ఐ) బెంగళూరు వారు నిర్వహించే ఎంట్రన్స్‌లో దేశ వ్యాప్తంగా 174 మంది ఎంపిక కాగా అందులో లోకేష్ కుమార్ ఉన్నాడు. ఎంసెట్‌లో 402వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.