డీన్, ప్రిన్సిపల్ వేధిస్తున్నారు...
కళాశాల వద్ద మహిళ ప్రిన్సిపల్, లెక్చరర్ల ఆందోళన
హిమాయత్‌నగర్: నారాయణగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో తమను వేధిస్తున్నారని మహిళా ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు జూనియర్ లెక్చరర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్‌ఎల్‌ఎస్, టీఎస్‌ఎల్, టీసీఈపీఎస్ నాయకులు మద్దతుగా నిలిచి డీన్, ప్రిన్సిపల్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం... నారాయణగూడలోని చైతన్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లుగా ప్రవీణ్, మధు, శ్రీనివాస్, రాజేష్ పని చేస్తున్నారు. వీరిని కొంతకాలంగా డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు పలు రకాలుగా వేధిస్తున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిర్మయిని డీన్ కుమార్, తోటి ప్రిన్సిపల్ స్వామిరావు, ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమెను ఏదో ఒక కారణంతో తరచూ వేరే క్యాంపస్‌లకు బదిలీ చేస్తున్నారు. వారం క్రితం కెమిస్ట్రీ లెక్చరర్ ప్రవీణ్‌కు కుమారుడు పుట్టడంతో యాజమాన్యం అనుమతితో మూడు రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. నాలుగో రోజు కళాశాలకు వచ్చిన ప్రవీణ్‌ను ప్రిన్సిపల్ స్వామిరావు.. ‘ఎందుకు వచ్చావ్..కాలేజీ నుంచి పొమ్మని’ దుర్భాషలాడాడు.
దీంతో బాధితుడు టీఆర్‌ఎల్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, టీసీపీఎఫ్ చైర్మన్ సునీల్‌కుమార్, టీఎల్‌ఎస్ అధ్యక్షుడు మహేందర్‌లను ఆశ్రయించాడు. దీంతో బాధిత లెక్చరర్లకు మద్దతుగా వీరంతా శుక్రవారం కళాశాలలో ఆందోళన చేపట్టారు. సుమారు గంటన్నరపాటు కళాశాల యాజమాన్యానికి వీరికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లు తమపై చేసిన ఆరోపణలను డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు ఖండించారు. తాము ఎవరినీ ఏ విధంగా వేధించడంలేదన్నారు. పర్మిషన్ తీసుకుండా సెలవులు తీసుకోవడంపై ప్రశ్నించినందుకు తమపై తప్పుడు ఆరోపణలు, చేసి దాడికి యత్నించారన్నారు.