కర్నూలు(లీగల్): ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్ నుంచి గెంటివేయడంపై కర్నూలు కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. ఇందులో కళాశాల యాజమాన్యానికి సహకరించిన పోలీసులపైనా మరో ఫిర్యాదు దాఖలైంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేతంచర్లకు చెందిన డి.ఎల్.ఎన్.శాస్త్రి కుమార్తె కర్నూలు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేది. ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో 2014 ఏప్రిల్ 8న అర్ధరాత్రి కళాశాల యాజమాన్యం హాస్టల్ నుంచి గెంటేసింది. అప్పట్లో ఆ విద్యార్థిని తండ్రి కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కళాశాల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సదరు కేసు దర్యాప్తు చేయాలని కర్నూలు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ కేసులో పోలీసు అధికారులు ఫిర్యాది, బాధితురాలిని విచారించకుండానే తప్పుడు కేసంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో ఫిర్యాది తిరిగి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు. శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం, కర్నూలు పోలీసులపై చర్యలు చేపట్టి.. తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు ఈనెల 25న విచారణకు రానున్నట్లు ఫిర్యాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment