శ్రీచైతన్యకు షోకాజు నోటీసు జారీ | show cause notice to Sri Chaitanya junior college | Sakshi
Sakshi News home page

శ్రీచైతన్యకు షోకాజు నోటీసు జారీ

Published Sat, Oct 21 2017 1:40 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

show cause notice to Sri Chaitanya junior college - Sakshi

నెల్లూరు (టౌన్‌):  నగరంలోని ఇస్కాన్‌సిటీలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌కు ఎదురు మాట్లాడాడని విద్యార్థి దుంపా పృధ్వీసాయికుమార్‌ను యాజమాన్యం కొట్టడంపై ఆర్‌ఐఓ బాబూజాకబ్‌ స్పందించారు. శుక్రవారం కళాశాలకు వెళ్లి విచారించారు. తొలుత విద్యార్థి పృధ్వీసాయికుమార్‌ను పిలిచి కొట్టడంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ వెంకట్, క్యాంపస్‌ ఇన్‌చార్జి శివను పిలిచి విచారణ చేపట్టారు. విద్యార్థిని కొట్టారని తేలడంతో యాజమాన్యానికి షోకాజు నోటీసు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ పంపాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రిన్సిపల్‌ వెంకట్, క్యాంపస్‌ ఇన్‌చార్జి శివను అక్కడి నుంచి పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ బాబూజాకబ్‌ మాట్లాడుతూ విద్యార్థులను కొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. కళాశాల యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే తరగతులు నిర్వహించాలన్నారు. అంతకంటే ఎక్కువ సమయంలో క్లాసులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు (టౌన్‌):  విద్యార్థి పృధ్వీసాయికుమార్‌ను తీవ్రంగా కొట్టిన శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ  రాష్ట్ర కన్వీనర్‌ అంజయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్టోన్‌హోస్‌పేటలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో ఆర్‌ఐఓ బాబూజాకబ్‌కు శుక్రవారం వినతిపత్రం  అందజేశారు. హోంవర్క్‌ రాయలేదని బాత్‌రూంలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విద్యార్థిని కళాశాల యాజమాన్యం బెదిరిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆర్‌ఐఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అర్జున బాలకృష్ణ తదితరులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement