ఐఐటీ ప్రవేశ పరీక్షలో మెరుపులు
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక ఐఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో జిల్లా విద్యార్థులు పలువురు మంచి ర్యాంక్‌లు సాధించారు. గురువారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. పట్టణానికి చెందిన వర్రి ఆదిత్యవర్ధన్ (శ్రీచైతన్య జూనియర్ కళాశా ల) జాతీయ స్థాయిలో 17వ ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 2వ ర్యాంక్ సాధించాడు. అదే విద్యాసంస్థకు చెందిన పలువురు జిల్లా విద్యార్థులు పలు మంచి ర్యాంక్‌లు సాధించారు. వారిలో దంతులూరి శ్రీకర్ వర్మకు 785వ ర్యాంక్, బులుసు భానుమిత్రకు 1,474వ ర్యాంక్, బాడంగి మండలం వాడాడ కు చెందిన గొట్టాపు శ్రావణ్‌కుమార్‌కు 2,299వ/ఓబీసీ-282వ ర్యాంక్, ఐ.అనుదీప్‌కు 2,683వ ర్యాంక్, శంబంగి శ్రీచైతన్యకు 4,643వ ర్యాంక్, బొట్టు వంశీకి 9,769వ ర్యాంక్‌లు లభించాయి.
సివిల్స్ లక్ష్యం : వర్రి ఆదిత్యవర్ధన్
దేశంలో ఉత్తమ సేవలను అందించగల ప్రతిష్టాత్మకత సివిల్స్ లక్ష్యంగా ఉన్నత చదువుల్లో కృషి చేస్తానని 17వ ర్యాంకు సాధించిన వర్రి ఆదిత్యవర్ధన్ ఫోన్‌లో వివరించాడు. ముంబై ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో చేరి అత్యున్నత ప్రమాణాల ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తానని. అదే సమయంలో దేశంలో అత్యన్నత స్థాయి పరీక్ష అయిన సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధన లక్ష్యంగా కృషి చేస్తానని చెప్పాడు. ఆదిత్యవర్ధన్ తండ్రి వర్రి మహేష్ విశాఖ సాంఘిక సంక్షేమ కళాశాలలో అధ్యాపకులు. తల్లి శ్రీదేవి పూసపాటిరేగ మండలంలో స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో 336/360 మార్కులు సాధించి ఉత్తరాంధ్రలో ప్రథముడిగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన విట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఎంసెట్‌లో 5వ ర్యాంక్ సాథించి జిల్లా పేరు రాష్ట్రస్థాయిలో నిలబెట్టాడు. ఐఐటీ ర్యాంక్ విషయూన్ని తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు స్థానిక పద్మావతినగర్ కాలనీల్లో ఆనందోత్సాహంలో మునిగారు. మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు మిఠాయి పంచుకున్నారు.
లోకేష్‌కు 138వ ర్యాంకు
బెలగాం: ఐఐటీ(జేఈఈ) ఫలితాల్లో గరుగుబిల్లి మండలం బురదావెంకటాపురానికి చెందిన విద్యార్థి లోకేష్ కుమార్ సత్తా చాటాడు. ఓబీసీలో 138వ ర్యాంక్ సాధించాడు. లోకేష్ తండ్రి బొత్స పరిశినాయుడు శ్రీకాకుళంలోని సర్వే , భూమి రికార్డులు శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తల్లి సుగుణ గృహిణి. లోకేష్ ఐఐటీ మెయిన్స్‌లో సైతం 289 మార్కులు సాధించి ఎన్‌ఐటీఎస్‌లో ప్రవేశ అర్హత సాధించాడు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో 351 మార్కులు , వీఐటీ-2104 లో 366ర్యాంకు సాధించాడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటస్టిక్స్ (ఐఎస్‌ఐ) బెంగళూరు వారు నిర్వహించే ఎంట్రన్స్‌లో దేశ వ్యాప్తంగా 174 మంది ఎంపిక కాగా అందులో లోకేష్ కుమార్ ఉన్నాడు. ఎంసెట్‌లో 402వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.