ఐఐటీ అడ్మిషన్లకు ఒకే టెస్ట్?
- జేఈఈ(మెయిన్), జేఈఈ(అడ్వాన్స్) స్థానంలో ఐఐటీలకు ప్రత్యేక ప్రవేశపరీక్ష!
- ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా?.. 2012లో ప్రవేశపెట్టిన రెండంచెల ప్రవేశ పరీక్ష స్థానంలో మళ్లీ గతంలోలా ఐఐటీలకు ప్రత్యేకంగా ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి ఐఐటీ వర్గాలు. ప్రస్తుతమున్న రెండంచెల పరీక్షావిధానాన్ని సమీక్షించేందుకు ఈ ఆదివారం ఒక కమిటీని జాయింట్ ఆడ్మిషన్ బోర్డ్(జేఏబీ) ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ ప్రస్తుత పరీక్షా విధానాన్ని, గత పరీక్షా విధానాన్ని అధ్యయనం చేసి జేఏబీకి సిఫారసులు చేస్తుంది. అయితే, ఐఐటీలకు ప్రత్యేకంగా ఒకే పరీక్షను నిర్వహించాలన్న ప్రతిపాదనకే అత్యధిక ఐఐటీలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2012లో ప్రవేశపెట్టిన ప్రస్తుత విధానం ప్రకారం.. మొదట ‘జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్’ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినవారు మాత్రమే ‘జేఈఈ అడ్వాన్స్’పరీక్ష రాసేందుకు అర్హులు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీల్లో అడ్మిషన్లు లభిస్తాయి. అయితే, ఈ విధానం చాలా సమయం తీసుకుంటోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో జేఏబీ ఈ విధానంపై ఆదివారం నాటి సమావేశంలో చర్చించి, కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవేళ ఈ విధానం స్థానంలో, గతంలోలా ఐఐటీలకు ఒకే ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపితే.. యూపీయే హయాంనాటి మరో నిర్ణయం రద్దు అయినట్లు అవుతుంది.