పిన్ని సూర్యకళ, రాఘవి (ఫైల్)
సాక్షి, చెన్నై : భర్త మొదటి భార్య బిడ్డను తల్లి స్థానంలో ఉండి ఆలనా పాలనా చూస్తూ వచ్చిన పిన్ని హఠాత్తుగా ఉన్మాది అయింది. తన కడుపున పెరుగుతున్న పిండాన్ని చంపుకోవాలన్న భర్త హెచ్చరికతో కసాయిగా మారింది. తన బిడ్డ కోసం సవతి బిడ్డ అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది. సవతి వద్దకే ఆ బిడ్డను పంపుతూ మిద్దె మీద నుంచి కిందకు తోసి హతమార్చింది. ఏమీ ఏరుగనట్టు బిడ్డ కనిపించడంలేదని నాటకం ఆడి చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.
చెన్నై శివార్లలోని సెంబాక్కం తిరుమలైనగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పార్థిబన్ నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో పార్థిబన్ ఇంజినీర్. పార్థిబన్‌కు గతంలో శరణ్యతో వివాహం అయింది. ఆమె అనారోగ్యంతో మరణించడంతో కుమార్తె రాఘవి ఆలనా పాలనా చూసుకోవడం పార్థిబన్‌కు కష్టంగా మారింది. చివరకు రెండేళ్ల క్రితం సూర్యకళను వివాహం చేసుకున్నాడు. తొలి నాళ్లలో రాఘవిని తన బిడ్డ వలే ఎంతో ప్రేమగా సూర్య కళ చూసుకుంది. అయితే, ఏడాదిన్నర క్రితం తన కడుపున వియన్ జన్మించడంతో రాఘవిని దూరం పెట్టడం మొదలెట్టింది. ఆరేళ్ల రాఘవి మీద ప్రేమ తగ్గినా, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో ఏమో అనుకుని ఆ బిడ్డ ఆలనా పాలన చూస్తూనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన కాసేపటికి రాఘవి కనిపించడం లేదంటూ సూర్యకళ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పార్థిబన్ ఆందోళనకు గురయ్యాడు.
రక్తి కట్టించిన నాటకం...
భర్త పార్థిబన్‌తో కలిసి బోరున విలపిస్తూ సూర్యకళ బిడ్డ కోసం గాలించింది. ఆ పరిసరాలన్నీ గాలించినా, విచారించినా రాఘవి జాడ కానరాలేదు. చివరకు అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి చుట్టు పక్కల గాలించగా, ముళ్ల పొదళ్లలో రాఘవి పడి ఉండడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లి చూశారు. తలకు తీవ్ర గాయం కావడంతో స్పృహ తప్పి పడి ఉన్న బిడ్డను భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. రాఘవికి ఏమైందో అన్న వేదనతో సూర్యకళ కన్నీటి పర్యంతం అవుతుండడం అందర్నీ కలచి వేసింది. అయితే, పాప మరణించి చాలా సేపు అవుతున్నట్టుగా వైద్యులు తేల్చడంతో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారించగా నాటకం బట్టబయలు అయింది.
విచారణతో వెలుగులోకి ఉన్మాది పిన్ని..
బిడ్డ పడి ఉన్న ప్రదేశం, బహుళ అంతస్తుల భవనంను పోలీసులు క్షుణ్ణంగానే పరిశీలించారు. బిడ్డ ప్రమాదవశాత్తు పడి మరణించి ఉంటుందని సర్వత్రా భావించినా, పోలీసులు సాగించిన పరిశీలన హత్యగా తేలింది. ప్రమాద వశాత్తు కింద పడి ఉన్న పక్షంలో, ఆ భవనానికి కొంత దూరంలో రాఘవి మృతదేహం ఉండాలని, ఎవరో బలవంతంగా తోసి ఉన్న దృష్ట్యా, మరింత దూరంలో పడి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో కన్నీటి పర్యంతంతో నాటకాన్ని రక్తి కట్టిస్తూ, అందరి హృదయాన్ని ద్రవింప చేస్తూ వచ్చిన సూర్యకళ గుట్టు రట్టు అయింది. ఆమెపై అనుమానంతో పోలీసులు ఆ ఇంట్లో ఉంచి విచారించారు. పోలీసుల బెదిరింపులో లేదా, తప్పు చేశానన్న పాశ్చాత్తాపమో.. ఏమోగానీ, నేరాన్ని సూర్యకళ అంగీకరించడంతో అక్కడి వారందరూ ఆగ్రహానికి లోనయ్యారు. ఆమెకు చీవాట్లు పెడుతూ, తిట్టి పోశారు. అయితే, తన బిడ్డ కోసం సవతి తల్లి బిడ్డను అడ్డు తొలగించుకోవాల్సి వచ్చినట్టు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ మేరకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న దృష్ట్యా, మూడో బిడ్డ వద్దంటూ పార్థిబన్ సూర్యకళను కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వచ్చి ఉన్నాడు. తన సంపాదన ప్రస్తుతం చాలడం లేదని, మూడో బిడ్డ వద్దని ఆబార్షన్ చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి ఉన్నాడు. తన బిడ్డకు అడ్డుగా రాఘవి ఉండడంతోనే ఆమె తల్లి వద్దకు పంపించేందుకు పథకం వేసి, పై నుంచి కిందకు తొసి ఏమీ ఏరుగనట్టుగా వచ్చి భర్తకు ఫోన్ చేశానని, అయితే, తాను పెద్ద తప్పు చేశానంటూ బోరున విలపించినా, కసాయి తనం ఆమెను కటకటాల్లోకి నెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment