Suryakala
-
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన
పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది. -
ఉన్మాది పిన్ని
సాక్షి, చెన్నై : భర్త మొదటి భార్య బిడ్డను తల్లి స్థానంలో ఉండి ఆలనా పాలనా చూస్తూ వచ్చిన పిన్ని హఠాత్తుగా ఉన్మాది అయింది. తన కడుపున పెరుగుతున్న పిండాన్ని చంపుకోవాలన్న భర్త హెచ్చరికతో కసాయిగా మారింది. తన బిడ్డ కోసం సవతి బిడ్డ అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది. సవతి వద్దకే ఆ బిడ్డను పంపుతూ మిద్దె మీద నుంచి కిందకు తోసి హతమార్చింది. ఏమీ ఏరుగనట్టు బిడ్డ కనిపించడంలేదని నాటకం ఆడి చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. చెన్నై శివార్లలోని సెంబాక్కం తిరుమలైనగర్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పార్థిబన్ నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో పార్థిబన్ ఇంజినీర్. పార్థిబన్‌కు గతంలో శరణ్యతో వివాహం అయింది. ఆమె అనారోగ్యంతో మరణించడంతో కుమార్తె రాఘవి ఆలనా పాలనా చూసుకోవడం పార్థిబన్‌కు కష్టంగా మారింది. చివరకు రెండేళ్ల క్రితం సూర్యకళను వివాహం చేసుకున్నాడు. తొలి నాళ్లలో రాఘవిని తన బిడ్డ వలే ఎంతో ప్రేమగా సూర్య కళ చూసుకుంది. అయితే, ఏడాదిన్నర క్రితం తన కడుపున వియన్ జన్మించడంతో రాఘవిని దూరం పెట్టడం మొదలెట్టింది. ఆరేళ్ల రాఘవి మీద ప్రేమ తగ్గినా, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో ఏమో అనుకుని ఆ బిడ్డ ఆలనా పాలన చూస్తూనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన కాసేపటికి రాఘవి కనిపించడం లేదంటూ సూర్యకళ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పార్థిబన్ ఆందోళనకు గురయ్యాడు. రక్తి కట్టించిన నాటకం... భర్త పార్థిబన్‌తో కలిసి బోరున విలపిస్తూ సూర్యకళ బిడ్డ కోసం గాలించింది. ఆ పరిసరాలన్నీ గాలించినా, విచారించినా రాఘవి జాడ కానరాలేదు. చివరకు అపార్ట్మెంట్ పైకి వెళ్లి చుట్టు పక్కల గాలించగా, ముళ్ల పొదళ్లలో రాఘవి పడి ఉండడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లి చూశారు. తలకు తీవ్ర గాయం కావడంతో స్పృహ తప్పి పడి ఉన్న బిడ్డను భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. రాఘవికి ఏమైందో అన్న వేదనతో సూర్యకళ కన్నీటి పర్యంతం అవుతుండడం అందర్నీ కలచి వేసింది. అయితే, పాప మరణించి చాలా సేపు అవుతున్నట్టుగా వైద్యులు తేల్చడంతో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారించగా నాటకం బట్టబయలు అయింది. విచారణతో వెలుగులోకి ఉన్మాది పిన్ని.. బిడ్డ పడి ఉన్న ప్రదేశం, బహుళ అంతస్తుల భవనంను పోలీసులు క్షుణ్ణంగానే పరిశీలించారు. బిడ్డ ప్రమాదవశాత్తు పడి మరణించి ఉంటుందని సర్వత్రా భావించినా, పోలీసులు సాగించిన పరిశీలన హత్యగా తేలింది. ప్రమాద వశాత్తు కింద పడి ఉన్న పక్షంలో, ఆ భవనానికి కొంత దూరంలో రాఘవి మృతదేహం ఉండాలని, ఎవరో బలవంతంగా తోసి ఉన్న దృష్ట్యా, మరింత దూరంలో పడి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో కన్నీటి పర్యంతంతో నాటకాన్ని రక్తి కట్టిస్తూ, అందరి హృదయాన్ని ద్రవింప చేస్తూ వచ్చిన సూర్యకళ గుట్టు రట్టు అయింది. ఆమెపై అనుమానంతో పోలీసులు ఆ ఇంట్లో ఉంచి విచారించారు. పోలీసుల బెదిరింపులో లేదా, తప్పు చేశానన్న పాశ్చాత్తాపమో.. ఏమోగానీ, నేరాన్ని సూర్యకళ అంగీకరించడంతో అక్కడి వారందరూ ఆగ్రహానికి లోనయ్యారు. ఆమెకు చీవాట్లు పెడుతూ, తిట్టి పోశారు. అయితే, తన బిడ్డ కోసం సవతి తల్లి బిడ్డను అడ్డు తొలగించుకోవాల్సి వచ్చినట్టు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ మేరకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న దృష్ట్యా, మూడో బిడ్డ వద్దంటూ పార్థిబన్ సూర్యకళను కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వచ్చి ఉన్నాడు. తన సంపాదన ప్రస్తుతం చాలడం లేదని, మూడో బిడ్డ వద్దని ఆబార్షన్ చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి ఉన్నాడు. తన బిడ్డకు అడ్డుగా రాఘవి ఉండడంతోనే ఆమె తల్లి వద్దకు పంపించేందుకు పథకం వేసి, పై నుంచి కిందకు తొసి ఏమీ ఏరుగనట్టుగా వచ్చి భర్తకు ఫోన్ చేశానని, అయితే, తాను పెద్ద తప్పు చేశానంటూ బోరున విలపించినా, కసాయి తనం ఆమెను కటకటాల్లోకి నెట్టింది. -
మొక్కులు ఫలించాయి..సూర్యకళ కోలుకుంటోంది
పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్: ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పది రోజులుగా భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిట్టినీడి సూర్యకళ నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ఈ ప్రాంత ప్రజలు దేవుళ్లను మొక్కారు. మనసున్న దాతలు సూర్యకళ వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు. యువత విరాళాలు సేకరించి తమ వంతు సహాయం అందించారు. ఈనెల 1న భీమవరం వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో సోడా గ్యాస్ సిలిండర్ లీకై ఒక ఇంటి గోడను చీల్చుకుని లోపలికి దూసుకు వెళ్లిన సంఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రం గా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన సూర్యకళ ఇంటర్ పాసై డిగ్రీలో చేరేందుకు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కుమార్తె వైద్య కోసం తల్లిదండ్రులు వెంకట శివకుమార్, నాగలక్ష్మిలు తల్లడిల్లిపోయారు. ఈ సమయంలో మేమున్నామంటూ భీమవరం ప్రజలు ముందుకు వచ్చారు. వైద్యానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం కావడంతో చాలా మంది సహాయపడుతున్నారు. ఈ సమయంలో భీమవరం హాస్పటల్స్ వైద్యుల కృషి చాల వరకూ ఫలించింది. ఆపరేషన్ అనంతరం సూర్యకళ కళ్లు తెరిచి అందరినీ గుర్తుపడుతోంది. నెమ్మదిగా మాట్లాడగలుగుతున్న ఆమెను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషపడుతున్నారు. అయితే సూర్యకళ కాలుకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండటంతో హైదరాబా ద్‌కు పంపాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. సూర్యకళ సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిగ్రీలో చేరాలన్న కోరిక నెరవేరేందుకు మరికొంత ఆర్థిక సహాయం అవసరమవుతుంది. దాతలు స్పందిస్తే సూర్యకళ తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు. ఆంధ్రాబ్యాంక్ ఖాతా నంబర్ : 004610100038569, ఐఎఫ్ఎస్సీ కోడ్ ANDB 0000046. వివరాల కోసం సెల్ నెంబర్ 91777 33995, 77990 24033లో సంప్రదించాలని కోరుతున్నారు. స్నేహం కోసం.. స్పందించిన హృదయం తమ చిన్ననాటి స్నేహితురాలిని కాపాడుకునేం దుకు మిత్రులంతా ఒక్కటయ్యారు. ఆపన్న హస్తం అందించారు. లక్ష రూపాయలు విరాళం సేకరించారు. దాతలు స్పందిం చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యకళతో ఎస్ యూఎస్ హైస్కూ ల్లో చదువుకున్న మిత్రులు ఆమె ఆరోగ్యం కోసం తపిస్తున్నారు. అందరూ ఒక్కటిగా కలిసి విరాళాలు సేకరించి సూర్యకళ తల్లి నాగలక్ష్మికి గురువారం అందజేశారు. -
విధి వక్రించి.. కళ తప్పింది
పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన ఆనందం.. డిగ్రీలో చేరాలన్న ఉత్సాహంతో ఉన్న ఆ విద్యార్థినిని విధి చిన్నచూపు చూసింది. సోడా గ్యాస్ సిలిండర్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఇల్లు, కళాశాల తప్ప మరో లోకం తెలియని ఆ విద్యార్థిని గత ఐదు రోజులుగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానిక వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో ఈనెల సోడా గ్యాస్ సిలిండర్ లీకై ఒత్తిడితో ఇంటి గోడను పగలగొట్టుకుని లోపలికి దూసుకువెళ్లిన ఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకళ ఆరోగ్య పరిస్థితిని ఈ ప్రాంత వాసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కోసం అందరి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. తల్లి నాగలక్ష్మి ఇడ్లీ అమ్ముతూ, తండ్రి వెంకట శివకుమార్ కాయకష్టం చేసుకుంటూ తమ ఇద్దరు ఆడపిల్లలు సూర్యకళ, లక్ష్మీ సాయిదుర్గను చదివిస్తున్నారు. సూర్యకళ ఇంటర్ పాసై డిగ్రీలో చేరేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. డిగ్రీ పాసై చిన్న ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆమెను విధి ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రమాదం నుంచి సూర్యకళ చెల్లెలు లక్ష్మీ సాయిదుర్గ అదృష్టవశాత్తూ త్రుటిలో తప్పించుకోగలిగింది. టీవీ చూస్తూ చెల్లెలితో పై చదువుల గురించి చర్చించుకుంటున్న సంతోష సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇద్దరు ఆడపిల్లలూ చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్న తమ పెద్దకుమార్తెను చూసి దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. మనసున్న మారాజులు తమవంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరికొందరు విరాళాలు సేకరించి ఇస్తున్నారు. ప్రమాదంలో సూర్యకళ నడుము కింది భాగం బాగా దెబ్బతినడంతో వైద్యం నిమిత్తం రూ.10 లక్షలుపైనే వ్యయమవుతుందని తెలుస్తోంది. దెబ్బతిన్న భాగంలో తొలి ఆపరేషన్‌కు వైద్యులు ఎంతో శ్రమించారు. మానవతా దృక్పథంతో వైద్యులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో సూర్యకళకు నయం చేసేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తం అవసరం కావడంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే ఆ నిరుపేద కుటుంబానికి కొంత ఊరడింపు కలుగుతుంది. సహాయం చేయాలనుకునే వారి కోసం... బాధితురాలి తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంకు అకౌంట్ నంబర్ 004610100038569 ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్: ANDB0000046 బాధితురాలి బాబాయ్ జనార్దన్ ఫోన్ నంబర్లు 9177733995 7799024033 -
మహిళ ఆత్మహత్య
కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. గ్రామానికి చెందిన వనపట్ల సూర్యకళ(36) అనే మహిళను అదే గామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి సోమవారం తీవ్రంగా కొట్టాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాధవరావు కొట్టాడనే మనస్తాపంతోనే సూర్యకళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీనియర్ నటి సూర్యకళ కన్నుమూత
సీనియర్ నటి కె.సూర్యకళ (72) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కాకినాడకు చెందిన రామిరెడ్డి, సుభద్రల కుమార్తె సూర్యకళ బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. సినీరంగంపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. ఏయన్నార్, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ముఖ్య పాత్ర పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందారామె. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యకళ మొత్తం 500 చిత్రాలకు పైగా నటించారు. ఆమె చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం కాలనీలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సూర్యకళ సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. సూర్యకళ అంత్యక్రియలు మంగళవారం ఉదయం చెన్నైలో జరిగాయి.