వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్న మందరాడలోని ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ ఇల్లు
టంకాల శ్రీరామ్..వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ట్రేడ్ బ్రోకర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ ప్రస్తుతం సీఐడీ చేతిలో ఉంది. సంతకవిటి మండలం మందరాడలోని అక్కరాపల్లి రోడ్డులో ఉన్న శ్రీరామ్ ఇంటిని అధికారులు సీజ్ చేశారు.
అయితే ఈ ఇంట్లో నుంచి కొద్ది రోజులుగా రాత్రి పది గంటల తరువాత వింత శబ్దాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. తలుపులకు అధికారులు వేసిన సీళ్లు ఊడిపోయి ఉండడం.. కిటికీలకు పగుళ్లు ఏర్పడడంతో రాత్రి వేళ ఎవరైనా లోనికి చొరబడి అందులో ఉన్న విలువైన వస్తువులను మాయం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజాం/సంతకవిటి : ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్‌కు చెందిన ఇంట్లో వింత శబ్దాలు వస్తున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. దీంతో శ్రీరామ్ ఉదంతం మరోసారి ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అక్కరాపల్లి రోడ్డుల్లో ఉన్న ఇంట్లో రాత్రి సమయంలో ఏదో జరుగుతోందనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ తాలాడలోని కార్యాలయాన్ని ఎత్తివేసే ముందు మందరాడలో అక్కరాపల్లి రోడ్డులో రూ. 2 కోట్లుతో నూతనంగా ఇల్లు నిర్మించాడు.
గృహ ప్రవేశం అనంతరం అందులో వివాహం కూడా చేసుకున్నాడు. అయితే వివాహం నిమిత్తం వేసిన పచ్చని పదిరి తీయకముందే శ్రీరామ్ పరారయ్యాడు. దీంతో పెట్టుబడి పెట్టిన బాధితులంతా అతనిపై కేసులు పెట్టడంతో అతన్ని పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం.. అతనికి చెందిన కొత్త ఇంటిని సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి.
– ఆ శబ్దాలు ఏమిటీ?
శ్రీరామ్ ఇంట్లో కొద్దిరోజులుగా రాత్రి 10 గంటల తరువాత శబ్దాలు వింటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే రాత్రి వేళలో ఒకరిద్దరు ఆ ఇంటి వద్ద సంచరించడం, గోడలపై నుంచి లోపలికి దూకడం చేస్తున్నారంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి చూడగా ఇంటి బయట కిటికీ వద్ద పోలీసులు అతికించిన సీలు చిరిగి పోయిఉంది. ర్తు తెలియని వ్యక్తులు గోడలు దూకి లోనికి ప్రవేశించి కిటికీ తలుపులు తెరిచే ప్రయత్నం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
ఎవరికి ఆ ధైర్యం..
ఓ వైపు పోలీసులు, మరో వైపు సీఐడీ కనుసన్నల్లో ఉన్న ఇంట్లోకి చొరబడేందుకు ఎవరు ధైర్యం చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంటికి చెందిన కిటీకి తలుపులు కూడా పగిలి కనిపిస్తున్నాయి. బాధితులు తాము పెట్టిన పెట్టుబడులు విషయాన్ని జీర్ణించుకోలేక, అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో ఇలా ఇక్కడకు వచ్చి తలుపులు పగలకొట్టడం, ఇంట్లో ఏమైనా ఉన్నాయోమోనని ఆరా తీస్తున్నారా అనే అనుమానాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
సీఐడీ ఏమైనా చెబుతుందేమోనని ఎదురుచూపులు
ఇదిలా ఉండగా మరికొంతమంది పెట్టుబడిదారులు అప్పుడప్పుడు మందరాడ వచ్చి స్థానికుల వద్ద శ్రీరామ్ గురించి ఆరా తీస్తున్నారు. అతనికి ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయా? ఎవరికైనా పెట్టుబడులు తిరిగి చెల్లిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కొంతమంది పెట్టుబడిదారులు వివాహాలకు, శుభ కార్యక్రమాలకు పనికి వస్తాయనే ముందుచూపుతో శ్రీరామ్ వద్ద పెట్టుబడులు పెట్టారు.
అయితే బోర్డు తిప్పేయడంతో అలాంటి వారంతా ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేక దిగాలుగా ఉన్నారు. అటువంటివారంతా తమకు న్యాయం జరుగుతుందో..లేదో అని గుబులు చెందుతున్నారు. సీఐడీ అధికారులు ఏం చేస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆరా తీస్తాం
సంతకవిటి మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్ బ్రోకర్ టంకాల శ్రీరామ్ ఇంటి వద్ద జరుగుతున్న తంతుకు సంబంధించి ఆరా తీస్తాం. సంతకవిటి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తాం. పోలీసులు వేసిన సీల్‌ను తీసేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. కేసు దర్యాప్తులో ఉంది. ఎవరూ కూడా ట్రేడ్ బ్రోకర్ ఆస్తులకు సంబంధించి ఎటువంటి తొందరపాటు ప్రయత్నాలు చేయరాదు. – ఎల్‌ఆరేకే నాయుడు, సీఐడీ ఎస్సై, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment