ప్రతీకాత్మక చిత్రం
రాజు(పేరు మార్చాం). అతను రోజు వారీ కూలి. రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరు వందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా మూడుముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిందంతా ఇలా తగలబెట్టడం..
తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం అతని నిత్యకృత్యం. రోజులు గడిచాయి. అప్పులు పెరిగాయి. తీర్చేదారి లేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
సదాశివపేట(సంగారెడ్డి): కాయ్ రాజా కాయ్ కాస్తే ఉంది.. చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి మెట్లు, క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్ తిలక్ జూదం గురించి రాసిన ఓ కవిత ఇది.
సదాశివపేట మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది పరిస్థితి ముక్క కలిస్తే అదృష్టం తమదే అని ఆశపడుతున్నారు కొందరు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేరులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
జూదమే వారి ధ్యాస..
నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువకులు జూదానికి బానిసవుతున్నారు. కష్టపడి సంపాదించినదంతా పేకాటలో పోగోట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ ప్రాంతంలో కొందరి యువకుల జీవనశైలిగా మారింది.
ముఖ్యంగ సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వాటర్‌ప్లాంట్లు, పంక్షన్ హాళ్లు, ఇళ్లు ఇందుకు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్నం, నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమవుతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది.
నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు..
సదాశివపేట పట్టణంలోని నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోయింది. పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఇళ్లలో కొందరు రాజకీయ, మీడియా ప్రతినిధులు పేకాట ఆడుతుంటారనేది బహిరంగ రహస్యం. సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఫాంహౌజ్‌లు, వాటర్ ప్లాంటుతో పాటు నివాస గృహలు, బహిరంగ ప్రదేశాల్లో చాల ప్రాంతాల్లో నిత్యం పేకాట యథేచ్ఛగా సాగుతోంది.
కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు
పేకాట అడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేధన వర్ణనాతీతం. కొన్ని ఇళ్లల్లో అర్థరాత్రి వరకు నిత్యం పేకాట అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
పేకాట ఆడితే కఠిన చర్యలు..
పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా వదిలిపెట్టం. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గం. పేకాట అడుతున్న స్థవరాలను ఇప్పటికే గుర్తించాం. అదును చూసి దాడులు చేస్తాం. ప్రజలు సైతం పేకాట స్థావరాలపై సమాచారం అందించాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment