యశ్వంత్ (ఫైల్)
కడ్తాల్(కల్వకుర్తి): కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్ నగరంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ఆదిమూలం బిక్షపతికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవేందర్ ఉన్నత చదువుల కోసం జర్మనీ దేశం వెళ్లి విద్యనభ్యసిస్తుండగా, రెండో కుమారుడు శివ, చిన్న కుమారుడు యశ్వంత్‌లు, హైదరాబాద్ నగరంలోని హస్తినాపురం ఓంకారేశ్వరనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
గురువారం ఉదయం ఇద్దరు సోదరులు హస్తినాపురంలోని ఓ హోటల్‌కు వెళ్లి అల్పాహారం చేశారు. తాను రూమ్ వద్దకు వెళ్లి వస్తానని, సోదరుడిని ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్లిన యశ్వంత్.. తిరిగి హోటల్‌కు రాలేదు. యశ్వంత్ ఎంతకూ రాకపోవడంతో రూమ్‌కు వెళ్లిన శివకు.. యశ్వంత్ ఉరేసుకుని కనిపించాడు. షాక్‌కు గురైన శివ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. యశ్వంత్ ఇటీవల రాసిన ఈసెట్ పరీక్షల్లో మంచి ర్యాంకు రాకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
యశ్వంత్ కళ్లు దానమిచ్చిన తండ్రి..
యశ్వంత్ మరణించినా అతని చూపులు మాత్రం సజీవంగా మిగిలాయి. తన నేత్రాలతో మరో ఇద్దరి అంధుల జీవితాలకు వెలుగును ప్రసాదించాడు. యశ్వంత్ నేత్రాలను దానం చేస్తే మరో ఇద్దరి జీవితాలకు వెలుగును ప్రసాదించవచ్చని, యశ్వంత్ తండ్రిని అతని స్నేహితులు అడుగగా, అందుకాయన అంగీకరించడంతో రమాబాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు వారికి సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం యశ్వంత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడికే వచ్చిన ఐ బ్యాంకు నేత్ర వైద్యులు యశ్వంత్ నేత్రాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment