
బంగారమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సాయికృష్ణ
బొండపల్లి: తండ్రి ప్రవర్తనకు విసుగు చెందిన ఓ చిన్నారి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని అయ్యన్న అగ్రహారం గ్రామానికి చెందిన చుక్క పైడిరాజు, గౌరమ్మలకు ఒక్కగానొక్క కుతురు బంగారమ్మ. ఈమె గజపతినగరం ఆదిత్యా కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని తండ్రి పైడిరాజు ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. శబరిమాల యాత్ర ముగించుకుని గురువారమే గ్రామానికి చేరుకున్నాడు. అయితే యాత్ర నుంచి వచ్చినప్పటి నుంచి మద్యం తాగుతూ ఇంటికి రావడం మానేశాడు.
అయ్యప్పమాల వేసినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బంగారమ్మ శుక్రవారం వేకువజామున ఇంటిలో ఉన్న దూలానికి ఉరేసుకుని మృతి చెందింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై డి. సాయికృష్ణ సిబ్బందితో సహా గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment