భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య | Student Committed Suicide In Tirupati | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Published Fri, Jul 5 2019 4:17 PM | Last Updated on Sat, Jul 6 2019 7:52 AM

Student Committed Suicide In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వెస్ట్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ కథనం మేరకు.. పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడుకు చెందిన ప్రమీల, దివంగత కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె పి. పవిత్ర(18)ని తిరుపతిలో భవానినగర్‌లోని ఓ కళాశాలలో ఈనెల ఒకటో తేదీ బీఎస్సీ కోర్సులో చేర్చారు. అదే కళాశాలకు చెందిన వసతి కేంద్రంలో ఉంటూ యువతి కళాశాల వెళ్లి వచ్చేది. గురువారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడిన యువతి శుక్రవారం ఉదయం 5.45 గంటలకు తల్లికి ఫోన్‌ చేసి తనకు అదోలా ఉందని తెలిపింది.

అనంతరం కొంత సేపటికి తల్లి తిరిగి ఫోన్‌ చేసినా  తీయకపోవడంతో యువతి స్నేహితురాళ్లకు ఫోన్‌ చేసింది. అప్పటికే భవనం పైనుంచి పవిత్ర కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కళాశాల వసతి గృహం వాచ్‌ మెన్‌ క్షతగాత్రురాలిని రుయా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. యువత భవనం పై నుంచి దూకే సమయంలో అదే భవనం ఎదురుగా ఉన్న మరో భవనంలోని వ్యక్తి గుర్తించి, వాచ్‌మెన్‌ కి సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. అనంతరం పవిత్ర స్నేహితురాలు  పవిత్ర చనిపోయిందని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు రుయా ఆస్పత్రిలో మార్చురీ వద్దకు చేరుకున్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థిని మృతిపై పోలీసులు ఆత్మహత్య కేసును నమోదు చేశారు. 

మృతిపై పలు అనుమానాలు 
తమ కుమార్తె పవిత్ర మృతిపై కళాశాల యాజమాన్యం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని, స్నేహితురాలి ద్వారా సమాచారం తెలుసుకున్నామని మృతురాలి తల్లి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తూ తన కుమార్తెను చదవిస్తున్నానని తెలిపారు. ఐదంతస్తుల భవనంపై నుంచి పడినా మృతదేహానికి ఒక గాయం కూడా కాలేదని దీనిపై తమకు అనుమానం ఉందన్నారు. అయితే శవపరీక్షల ద్వారా మృతికి కారణాలు వెల్లడవుతాయని ఎస్‌ఐ తెలిపారు. అయితే మృతదేహం భవనం పక్కనే ఉన్న మట్టిపై పడడంతో అంతర్గత గాయాలతో మృతి చెంది ఉండవచ్చన్న పోలీసులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు.  మృతురాలు కుటుంబ సభ్యులకు డీవైఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించారు.

మా నిర్లక్ష్యం లేదు
కళాశాలలో ఈనెల మొదటి వారంలో విద్యార్థిని పవిత్ర చేరిందని, కళాశాలలో చేరినప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని కళాశాల కరస్పాండెంట్‌ తెలిపారు. వసతి గృహంలో ఉన్న సమయంలో ఆమె తల్లితో సైతం మాట్లాడిందన్నారు. శుక్రవారం ఉదయం యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వెంటనే వాచ్‌మెన్‌ గుర్తించి రుయా అత్యవసర విభానికి తరలించామని తెలిపారు. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు దీనిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు.  

శోకసముద్రంలో అడవికొడియంబేడు
పిచ్చాటూరు: మండలంలోని అడవికొడియంబేడుకు చెందిన పవిత్ర(18) శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. పవిత్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, సాయంత్రం 5 గంటలకు స్వగ్రామమైన అడవికొడియంబేడు తరలించారు. నాలుగు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన పవిత్ర విగతజీవిగా తిరిగి స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.  

తల్లడిల్లిన తల్లి
పిచ్చాటూరు: పవిత్ర మృతితో ఆమె తల్లి ప్ర మీల తల్లడిల్లిపోతోంది. పవిత్ర తండ్రి కుమార్‌ పదేళ్ల క్రితమే మరణించారు. తల్లి ప్రమీల  అడవి కొడియంబేడులో అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. అయినా తండ్రి లేని లోటు లేకుండా తన చిరు ఉద్యోగంతో తన కుమార్తెను చదివిస్తోంది. గురువారం రాత్రి కూడా పవిత్ర తనతో ఫోన్‌లో మాట్లాడిందని, సూర్యో దయానికి మరణించినట్లు సమాచారం అందిందని తల్లి ప్రమీల బోరుమని విలపించింది. తల్లి రోదనలు చూసి చుట్టుపక్కల వారు కంట తడి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement