మార్చురీ గది వద్ద రోదిస్తున్న బాలుడి తల్లి రమణమ్మ నవీన్ మృతదేహం
బంగారు కొండా.. నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా.. టై, బెల్ట్, బూట్లు వేసుకుని స్టడీ క్లాసులకు వెళ్లుతున్నానని చెప్పి... తిరిగిరాని లోకానికి వెళ్లితివే.. నేను ఎట్లా బతకాలి దేవుడా అంటూ ఆ తల్లి బోరున విలపించింది. కళ్లెదుట విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి ఆమె తల్లడిల్లిన తీరు చూపరులను కలచివేసింది.
అనంతపురం, తాడిపత్రి టౌన్: పట్టణంలోని నంద్యాల రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు..సుంకులమ్మపాలెంలోని సంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న రమణ, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు నవీన్ (12)నంద్యాల రోడ్డులోని రుషీవ్యాలీ స్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిలుపై ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేవాడు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్టడీ క్లాసుకు వెళ్లి 8 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నంద్యాల రోడ్డులో కుడి వైపు నుంచి ఎడమ వైపునకు సైకిల్‌పై వస్తుండగా నంద్యాల వైపునకు వెళ్లుతున్న లారీ ఢీ కొంది. ఘటనలో విద్యార్థి తలకు తీవ్రగాయాల కావడంతో రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సైకిల్ కూడా దెబ్బతినింది. స్థానికులు వెంటనే పట్టణ పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్‌ఐ శ్రీధర్ ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ మృతితో సుంకులమ్మపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నెలలోమూడు ప్రమాదాలు
నంద్యాల రోడ్డులో నెల రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడు లారీల కారణంగానే జరిగినవి కావడం గమనార్హం. అందులో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలబెడుతుండడంతో రోడ్డు దాటేవారికి రోడ్డుపై వచ్చే వాహనాలు కనపడక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment