వారంతా ఉన్నత విద్యావంతులు. మంచి స్నేహితులు. అందరూ కలిసి విందు చేసుకున్నారు. అయితే డబ్బు తక్కువపడడంతో హైవేపైకి వచ్చి ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారులను బెదిరించి డబ్బు వసూలు చేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.
కల్లూరు: నగర శివారు గోశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్‌టీఏ అధికారులమంటూ వాహన డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మద్దూర్‌నగర్‌కు చెందిన చాకలి ఇనుకొండ వంశీ మహేష్, గురుబ్రహ్మ నగర్‌కు చెందిన పెండేకల్ రమణాచారి, లక్ష్మీటౌన్‌షిప్ వాసి కొండేటి సందీప్, బాబాబృందావన్‌నగర్ వాసి కవడపు నరహరి, గణేష్‌నగర్–2 నివాసి జి. అరుణ్‌కుమార్ యాదవ్, శకుంతలా కళ్యాణమంటపం వెనకనున్న రాజేశ్వరినగర్ వాసి వడ్డె వెంకటేష్‌ప్రసాద్ మంచి స్నేహితులు. ఈనెల 21న అందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు.
పార్టీకి డబ్బు తక్కువ రావడంతో గోశాల వద్ద జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమని, డబ్బివ్వాలంటూ ట్యాంకర్ డ్రైవర్ పుల్ల మాబాషాపై దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా సందీప్ ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మెన్, నరహరి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తుండగా, జి. అరుణ్‌కుమార్ పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఫైనలియర్ చదుతున్నాడు. వంశీ మహేష్, వడ్డె వెంకటేష్‌ప్రసాద్ బీటెక్ ఫెయిలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment