విశాఖలో సుపారీ గ్యాంగ్‌ అరెస్టు  | Supari gang arrested in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో సుపారీ గ్యాంగ్‌ అరెస్టు 

Published Sat, Jan 4 2020 5:26 AM | Last Updated on Sat, Jan 4 2020 5:26 AM

Supari gang arrested in Visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది మొదలవలస చిరంజీవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం విశాఖలో అరెస్ట్‌ చేశారు. ఓ రౌడీషీటర్, జర్నలిస్టు సహా ఆరుగురిని అరెస్ట్‌ చేసి మూడు కత్తులు, రూ.70 వేల నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా శుక్రవారం మీడియాకి ఈ వివరాలను వెల్లడించారు.  

ఏం జరిగిందంటే...? 
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన న్యాయవాదులు చిరంజీవి, అమ్మినాయుడు మధ్య రాజకీయ వైరుధ్యాలున్నాయి. కాగా అమ్మినాయుడు 2014లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యాడు. మరోవైపు విశాఖలో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న కిల్లి ప్రకాష్, చిరంజీవికి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మినాయుడు, కిల్లిప్రకాష్‌ కలసి చిరంజీవిని హతమార్చేందుకు రౌడీషీటర్‌ కన్నబాబుతో రూ. 10 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని రూ.4 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తాజాగా విశాఖ చినముషిడివాడలోని ఒక ఇంట్లో సమావేశమైన ఈ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కిల్లి ప్రకాష్, రాజన కన్నబాబు, గంటా రామరాజు, ఆసనాల ఏసుదాస్, బోనెల పరమేష్, పసిగడ అనిల్‌కుమార్‌ ఉన్నారు. ప్రధాన నిందితుడు కొత్తకోట అమ్మినాయుడుతో పాటు మదన్, సువ్వారి తేజేశ్వరరావు పరారీలో ఉన్నారు. దాడుల్లో డీసీపీ–2 ఉదయభాస్కర్‌ బిల్లా, ఏడీసీపీ (క్రైం) సురేష్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినా«థ్, ఏసీపీ(క్రైం) శ్రావణ్‌కుమార్, సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement