
భార్య రేఖతో విజయ్ వాఘాసియా (పాత చిత్రం)
సూరత్ : పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యాపారవేత్త... ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి తాముంటున్న అపార్ట్‌మెంట్ 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మీడియాలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్యా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
సర్థనా ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారవేత్త విజయ్ వాఘాసియా(35).. భార్య రేఖ(30), కొడుకు వీర్(4)లతో యోగి చౌక్‌లోని మేజిస్టిక్ అపార్ట్‌మెంట్ లో నివాసముంటున్నారు. గత కొంత కాలంగా ఆయన వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పులు చేశారు. అయినప్పటికీ కోలుకోకపోవటంతో వాటిని తీర్చే దారి తెలీక దారుణానికి తెగబడ్డారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన విజయ్ అదే అపార్ట్‌మెంట్ లో ఉంటున్న గౌరవ్ అనే స్నేహితుడితో కాసేపు మాట్లాడారు. ఆపై మంచి నీళ్లు మరిచిపోయానంటూ మళ్లీ పైకి వెళ్లిన కాసేపటికే భార్య, పిల్లలతో దూకినట్లు తెలుస్తోంది.
గౌరవ్ అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్ జేబులో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా కుటుంబ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. అప్పులు తీర్చేందుకు నా ముందు దారులు లేవు. ఆర్థిక సమస్యలతోనే ఇలా చేస్తున్నాం. నా తదనంతరం వ్యాపార బాధ్యతలు నా సోదరుడివే’ అని విజయ్ ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పారిపోలేక.. పరువు పోగొట్టుకోలేక... ప్రాణాలే విడిచారంటూ స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment