సూరత్‌ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్‌ఐఆర్‌ | Surat fire Accident FIR Filled On 3 Members | Sakshi
Sakshi News home page

సూరత్‌ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్‌ఐఆర్‌

Published Sat, May 25 2019 2:16 PM | Last Updated on Sat, May 25 2019 2:22 PM

Surat fire Accident FIR Filled On 3 Members - Sakshi

గాంధీనగర్‌ : సూరత్‌లోని కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమానితో పాటు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు, బిల్డరు ఇలా మొత్తం ముగ్గురి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తమ విచారణలో తేలిందన్నారు అధికారులు.

శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్న నాలుగో అంతస్తుకి చేరుకోవడానికి కేవలం ఒకవైపు నుంచే మెట్లు ఉన్నాయని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అలాగే మెట్లు కూడా చెక్కవి కావడంతో భారీ మంటల వలన అవి కాలి బూడిదయ్యాయన్నారు. దాంతో విద్యార్థులకు తప్పించుకోవడానికి వేరే మార్గం లేకుండా పోయిందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పై నుంచి దూకాల్సి వచ్చిందన్నారు. దాంతో వారికి తీవ్ర గాయాలై కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారన్నారు అధికారులు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు క్రమేపి బిల్డింగ్‌ అంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కోచింగ్‌ సెంటర్‌లో దాదాపు 70 మంది విద్యార్థులున్నుట్లు వెల్లడించారు. ప్రమాదం దృష్ట్యా కొద్ది రోజుల పాటు పట్టణంలో అన్ని రకాల ట్యూషన్స్‌ను, కోచింగ్‌ సెంటర్‌ల నిర్వహణ ఆపేయాలని పోలీసులు ఆదేశించారు. అగ్ని మాపక భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారు వెంటనే స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే అగ్ని మాపక కేంద్రం ఉందని.. కానీ ఫైరింజన్‌ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాల సమయం తీసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు కాపాడి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాడు.

ప్రమాదం జరిగిన అనంతరం సంఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ.. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement