
పేకేటి సూర్యనారాయణ, నాగలక్ష్మిల పెళ్లిరోజు ఫొటో
తూర్పుగోదావరి, కరప (కాకినాడరూరల్): వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన ఆ యువజంటలో నవ వరుడు మరణించగా నవ వధువు జైలుపాలైంది. నవ వధువు తన ప్రియుడితో కలసి హత్యకు పథకరచన చేసి ఈ హత్య చేయించినట్టు తేలింది. కరప మండలం పెనుగుదురువద్ద ఈనెల 22వ తేదీన ఒకయువకుడు (నవవరుడు) దారుణహత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహమైన వారం రోజుల్లోనే నవవరుడు హత్యకు గురికావడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో కరప ఎస్సై జి.అప్పలరాజు, పోలీసుసిబ్బంది వారంరోజుల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్టు చేసి కాకినాడ కోర్టులో హాజరుపరచగా రెండువారాలు రిమాండ్ విధించారు. కరప పోలీసుస్టేషన్‌లో గురువారం కాకినాడరూరల్ సీఐ పి.ఈశ్వరుడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం కరప గ్రామంలోని నీలయ్యతోటవీధికి చెందిన పేకేటి రాముడు కుమారుడు సూర్యనారాయణ (27) కరపమండలం పెనుగుదురు–పాతర్లగడ్డ రోడ్డులో పంటపొలాల్లో హత్యకు గురయ్యాడు.
గుర్తుతెలియని వ్యక్తులు తలపై నరకడంతో అతను మృతి చెందాడు. మృతుని సోదరుడు సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదేరోజు హత్యకేసుగా నమోదుచేశారు. మృతుడు పేకేటి సూర్యనారాయణకు కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో ఈనెల 15వ తేదీన వివాహమైంది. నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా అక్రమసంబంధం ఉంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టంలేక నాగలక్ష్మి తన ప్రియుడు రాధాకృష్ణతో కలసి హత్యకు పథక రచన చేసింది. అందులో భాగంగా ముద్దాయి రాధాకృష్ణ ఈనెల 21వ తేదీన సూర్యనారాయణకు ఫోన్ చేసి, సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడనుంచి పక్కనే గల పాతర్లగడ్డరూటులోగల పంటపొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ కూర్చుండపెట్టి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేరస్తుడు పట్టుబడింది ఇలా: స్థానికుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నవవరుడు సూర్యనారాయణ భార్యతో బయటకు వెళ్లివస్తానని చెప్పి వచ్చాడు. మృతుని భార్య నాగలక్ష్మి, ఆమెప్రియుడు రాధాకృష్ణ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం రాధాకృష్ణ పెనుగుదురు వద్ద నుంచి ఫోన్ చేసి సూర్యనారాయణను రప్పించాడు. కత్తితో నరికి చంపేసి, మృతదేహంపై గడ్డికప్పి, కత్తిని కేఎంజే కాలువలో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సోదరులు, బంధువులు ఆ రాత్రి ఎంతగా గాలించినా సూర్యనారాయణ జాడ తెలియలేదు. దాంతో వారు పోలీసుస్టేషన్‌లో సూర్యనారాయణ అదృశ్యంపై ఫిర్యాదుచేశారు. రాధాకృష్ణ పేపకాయలపాలెంలోని నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెళ్లికొడుకు మోటార్‌సైకిల్ పెనుగుదురు సమీపంలోని పొలాల్లో కనిపించిందని చెప్పాడు. నాగలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతోపాటు వెదకటానికి రాధాకృష్ణ కూడా ఏమీతెలియనట్టు వెళ్లాడు. మోటార్‌సైకిల్‌వద్దకు అందరితోపాటు వెళ్లి కొంతసేపటికి దూరంగా మృతుడి చెయ్యి కనిపిస్తోంది అదిగో అంటూ చూపించడంతో అందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ సూర్యనారాయణ మృదేహం కనిపించింది. మృతుని బంధువులు మృతదేహం కనిపించినట్టు కరప ఎస్సై జి.అప్పలరాజుకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చినా ఆధారాలు దొరకలేదు. కాకినాడరూరల్ సీఐ ఈశ్వరుడు, పోలీసుసిబ్బంది తమదైన శైలిలో మృతదేహం ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ క్లూ లాగడంతో ఒకటొకటిగా వాస్తవాలు వెలుగుచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment