లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను పట్టుకునేందుకు వస్తున్నారన్న సంగతి దుబేకు ముందే తెలుసునని, తనకు ఆ సమాచారం ఇచ్చింది కూడా పోలీసులేనని అతడి అనుచరుడు శంకర్ అగ్రిహోత్రి వెల్లడించాడు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుబే గ్యాంగ్ పోలీసులపై కాల్పులకు తెగబడిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో దుబే గ్యాంగ్‌లో పనిచేసే అగ్నిహోత్రిని కల్యాణ్‌పూర్‌లో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు బికూ గ్రామానికి వచ్చే ముందే వికాస్‌కు ఓ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అతడు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన వికాస్.. తన అనుచరులకు ఫోన్ చేసి 25-30 మంది.. పోలీసులను అడ్డుకునేలా పథకం రచించాడని తెలిపాడు.
ఈ నేపథ్యంలో పోలీసులు వారికి బదులిస్తూనే అతికష్టం మీద వికాస్ ఉన్న ఇంటి వద్దకు చేరుకోగా.. తమ గ్యాంగ్‌లోని ఇతర సభ్యులు వారిపై కాల్పులు జరిపారని పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తాను ఓ గదిలో ఇరుక్కుపోయినందున.. బయట ఏం జరుగుతుందో చూడలేకపోయానని చెప్పుకొచ్చాడు. కాగా వికాస్ దూబేకు సమాచారం ఇచ్చినట్టుగా భావిస్తున్న ఎస్‌హెచ్‌ఓ వినయ్ తివారిని ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
24 మంది పోలీసులతో సంబంధాలు
వికాస్ దూబే దాదాపు 24 మంది పోలీసులతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు అతడి కాల్‌డేటా ద్వారా వెల్లడైంది. చౌబేపూర్, శివరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే పలువురు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అతడి మీద దాదాపు 60 కేసులు ఉన్నా ఇంతవరకు టాప్ క్రిమినల్స్ జాబితాలో చేరలేదని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది.(ఉత్తరప్రదేశ్‌లో ఘోరం)
‘ప్రభుత్వ కారు’ను ఉపయోగించేవాడు
వికాస్ దూబే సోదరుడు దీప్ ప్రకాశ్ ఇంటి వద్ద పోలీసులు ఓ అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. 2014లో గవర్నర్ హౌజ్ వద్ద జరిగిన వేలంలో అతడు ఈ కారును కొనుగోలు చేశాడు. అయితే ప్రభుత్వ వాహనానికి సంబంధించిన పత్రాలను నేటికీ తన పేరు మీదకు బదిలీ చేయించుకోక పోవడం గమనార్హం. అంతేగాక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా దాదాపు ఆరేళ్లుగా అన్ని రకాల పన్నులు ఎగ్గొట్టడం సహా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వికాస్ ఈ కారును ఉపయోగించేవాడు.
దుండగుల కాల్పుల్లో మృతిచెందిన పోలీసుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
కాగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాన్ని కొనుగోలు చేసింది. గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి పేరిట దీనిని రిజిస్టర్ చేయించారు. దాదాపు 10 ఏళ్లు ఈ కారును ఉపయోగించిన తర్వాత వేలం వేయగా.. వికాస్ సోదరుడు దీనిని దక్కించుకున్నాడు. ఇక ఈ అంబాసిడర్‌లోనే వికాస్ తిరిగేవాడని, రాజకీయ నాయకులు, ఇతర ప్రభుత్వాధికారులను కలిసేందుకు ఇందులోనే వెళ్లేవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ వాహనాన్ని అడ్డుకుపెట్టున్నాడని పేర్కొన్నాయి.
ఇంట్లోనే బంకర్
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇంట్లో ఓ బంకర్ ఉందని కాన్పూర్ పోలీసులు తెలిపారు. అందులోనే అతడు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు దాచేవాడని పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి నాటి ఘటనలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాడు. ఎన్‌కౌంటర్‌లో భాగంగా దుండగులు 200-300 బుల్లెట్లు పేల్చినట్లు వెల్లడించారు. అంతేగాక ఏకే 47 సహా పలు పోలీస్ పిస్టోళ్లను వారు దోచుకెళ్లినట్లు వెల్లడించారు.
క్రూరత్వానికి పరాకాష్ట
వికాస్ దూబే గ్యాంగ్ ఘాతుకానికి బలైన 8 మంది పోలీసుల అటాప్సీ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. బిల్‌హౌర్ సర్కిల్ ఆఫీసర్(సీఓ) దేవేంద్ర మిశ్రా తలను వికాస్ అనుచరులు గొడ్డలితో నరికి చంపి... అతడి కాలి వేళ్లను కత్తిరించడం సహా శవాన్ని ఛిద్రం చేసి అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు వెల్లడైంది. కాగా పోలీసులపై కాల్పుల ఘటనలో వికాస్ దూబేతోపాటు 18 మందిపై పోలీసులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు వికాస్ దూబే తలపై రూ.50 వేలు రివార్డు, అగ్నిహోత్రి తలపై రూ.25 వేలు రివార్డు పోలీసుల ఇది వరకే ప్రకటించారు. అతడి కోసం దాదాపు 25 బృందాలు రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment