మృతుని కుటుంబసభ్యులు
లక్కవరపుకోట : మండలంలోని గేదులవానిపాలెం గ్రామానికి చెందిన గేదుల వెంకటరావు (42) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్తులందరూ గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే..
వెంకటరావు శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్ ఎక్సే్ఛంజ్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు.
బుధవారం ఉదయం కర్మాగారంలో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో కర్మాగార ప్రతినిధులు స్పందించి ప్రథమ చికిత్స అందించి విశాఖపట్నం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సాధారణ మరణమే అయితే మృతుడి తల వెనుక భాగంలో దెబ్బ ఎందుకు తగిలిందని బంధువులు, కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. వెంకటరావు మృతి వెనుక ఏదో తతంగం జరిగి ఉంటుందని కుటంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనకు దిగిన బంధువులు
ఇదిలా ఉంటే వెంకటరావు మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గేదులవానిపాలెం, వేచలపువానిపాలెం, గనివాడ గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కర్మాగారం గేటు వద్దకు చేరకుని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని బంధువులు స్పష్టం చేశారు. ఇందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
రంగంలోకి దిగిన డీఎస్పీ
పరిహారం అందజేయాలని కోరుతూ మృతుని కుటుంబీకులు, ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, గేదులవానిపాలెం, గనివాడ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు గేదుల నర్శినాయుడు, మల్లు నాయుడు, గేదుల శాంత, తదితరులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ, ఎస్.కోట సీఐ వై. రవి రంగలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
యాజమాన్యం ఇచ్చిన పరిహారం తీసుకోవాలని...లేనిపక్షంలో కేసు పెట్టుకోవచ్చని మృతుని కుటుంబ సభ్యులకు డీఎస్పీ వివరించారు. అనంతరం మరోసారి ఆందోళనకారులు, యాజమాన్యం చర్చించగా, ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment