అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Suspicious Death Of Man In Vizianagaram | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Tue, Jul 10 2018 11:02 AM | Last Updated on Tue, Jul 10 2018 11:02 AM

Suspicious Death Of Man In Vizianagaram - Sakshi

మహేష్‌ మృతదేహం 

గజపతినగరం రూరల్‌ : మండలంలోని గంగచోళ్లపెంట గ్రామ సమీపంలో గల చంపావతి నదిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన కలిగట్ల మహేష్‌ (24) ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువుల ఇళ్లల్లో వెతికారు. సోమవారం ఉదయం గంగచోళ్లపెంట సమీపంలోని చంపావతి నదిలో మహేష్‌ మృతదేహం ఉందని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కుమారుడి మృతదేహం చూసి కుటుంబ సభ్యుల రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. మృతుడి తల్లి మణి గృహిణి కాగా, తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. చెల్లి సౌజన్యకు గతేడాది వివాహం కాగా, మహేష్‌కు ఈ ఏడాది పెళ్లిచేసే యోచనలో ఉన్నారు.

ప్రేమే కారణమా..

మండలంలోని గంగచోళ్ల పెంట గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువతితో మహేష్‌ ప్రేమలోపడ్డాడు. అయితే వీరిద్దరి కూలాలు వేరు కావడంతో వివాహానికి ఇరుకుటుంబాల వారు ఒప్పుకోలేదు.

ఇదిలా ఉంటే ఇటీవల మహేష్‌ ప్రియురాలికి వేరొకరితో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు  సమాచారం. ఈ నేపథ్యంలో గంగచోళ్లపెంటలో మహేష్‌ చనిపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడుకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎవరో కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ముఖంపై దెబ్బలుండడం.. మృతుడి ఆధార్‌కార్డు, చిల్లర, సెల్‌ఫోన్‌ నది ఒడ్డునున్న రాయిపై ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి తన దగ్గరున్న  చిల్లర, సెల్‌ఫోన్, ఆధార్‌కార్డు ఎందుకు విడిచిపెడతారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పైగా ముఖంపై దెబ్బలు చూస్తుంటే ఎవరో కావాలనే హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

గ్రామ రెవెన్యూ అధికారి సత్యవతి సమాచారం అందించడంతో ఎస్సై పి. వరప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement