
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన సిలివేరు గ్రీష్మ నందిని (24) మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. మూడేళ్ల క్రితం నగరంలోని రామంతాపూర్ నివాసి దీపక్ (29)తో వివాహం జరిగింది. పెళ్లై మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో అదనపు కట్నం కోసం అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధింపులు ప్రారంభించారు.
ఈ మధ్యనే గ్రీష్మ నందిని తండ్రి ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందడంతో ఆ డబ్బులు కూడా కావాలని అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో వేధింపుల తట్టుకోలేని గ్రీష్మ నందిని బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే, గ్రీష్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అత్తింటి వారు చెబుతుండగా..ఆమె బంధువులు మాత్రం భర్త, అత్తమామలు కలసి గ్రీష్మను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న గ్రీష్మ బంధువులు తమకు ఎలాంటి సమాచారం లేకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి అక్కడి నుంచి నేరుగా మార్చురీకి ఎలా తరలి స్తారని..ఆమెది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment