చెన్నై: తమిళనాడుకు చెందిన జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్‌పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు)
ఇదిలా ఉండగా.. కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్‌లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. కాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపిన విషయం విదితమే.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్, బెనిక్స్‌లకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక ఈ హేయమైన ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్ నాలుగు పేజీల నివేదిక అందజేశారు.(కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment