బిగుస్తున్న ఉచ్చు | Task Force Police Reveals Gutka Mafia in Guntur | Sakshi
Sakshi News home page

బిగుస్తున్న ఉచ్చు

Published Wed, Apr 24 2019 2:03 PM | Last Updated on Wed, Apr 24 2019 2:03 PM

Task Force Police Reveals Gutka Mafia in Guntur - Sakshi

గుట్కా మాఫియా నుంచి మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు ఉచ్చుబిగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ విచారణలో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు మామూళ్లు దండుకున్న వ్యవహారంలో పక్కా ఆధారాలు వెలుగుచూశాయి. నెలవారీగా ఏ అధికారికి ఎంత మొత్తంలో మామూళ్లు ముట్టజెప్పిందీ లిఖితపూర్వకంగా గుట్కామాఫియా ఆధారాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో మామూళ్లు దండుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

సాక్షి, గుంటూరు: అవినీతి పోలీసు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. గుట్కా మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటున్న పోలీసు అధికారుల గుట్టు రట్టయింది. అటు గుట్కామాఫియా కీలక సభ్యులు, ఇటు అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బంది  ఎవరికి వారు అక్రమ వసూళ్ల వ్యవహారంపై లిఖిత పూర్వకంగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు ఆధారాలు అందజేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా జరగడంలో ఇద్దరు డీఎస్పీలతోపాటు, పలువురు సీఐలు, ఎస్‌ఐల పాత్రపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతో ఉన్నతాధికారులు సైతం వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా అధికారులకు డబ్బులు వసూలు చేసిన హెచ్‌సీలు, పీసీలపై సస్పెన్షన్‌వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల వద్ద డ్రైవర్లుగా, సహాయకులుగాపనిచేస్తున్న కొందరు హోంగార్డులు సైతం పోలీసు అధికారులకు డబ్బులు వసూలు చేసి పెట్టినట్లు స్వయంగా అంగీకరించడంతో వారిని మూడు నెలలపాటు విధులనుంచి తప్పించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. మొత్తానికి గుట్కా మాఫియాపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించడంతో ఇంటి దొంగల గుట్టు రట్టయింది.

గుంటూరు రూరల్‌ జిల్లాలోని రెండు సబ్‌ డివిజన్‌లలో గుట్కా మాఫియా  రెండు నెలలుగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న వ్యవహారం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో సందట్లో సడేమియాలా కొందరు అవినీతి అధికారులు గుట్కామాఫియా నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ గుట్కా అక్రమ రవాణా నుంచి అమ్మకాల వరకు యథేచ్ఛగా సాగేలా సహకారం అందిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సైతం వాడడంతో గుట్కా మాఫియాపై గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు కన్నెర్ర చేశారు. ఈ వ్యవహారంలో డివిజన్‌స్థాయి పోలీసు అధికారుల నుంచి ఎస్‌ఐల వరకు అందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ ఇలా వదిలేస్తే పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందనే తలంపుతో గాడిలో పెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. ఇందులో భాగంగా జిల్లాలో గుట్కా, మట్కా, సింగిల్‌ నంబర్‌ లాటరీలు, క్రికెట్‌ బెట్టింగ్‌లు, రేషన్, ఇసుక మాఫియాల నుంచి పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు వసూలు చేసి పెడుతున్న పోలీసు సిబ్బందిని గుర్తించి జిల్లా వ్యాప్తంగా 44 మందిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. రోజూ వారికి కౌన్సిలింగ్‌ ఇస్తూ పరేడ్‌ చేయిస్తూ సత్ప్రవర్తన పొందేలా శిక్షణ ఇస్తున్నారు. వారిలో గుట్కా మాఫియా నుంచి అధికారులకు డబ్బులు వసూలు చేసిపెట్టిన సిబ్బందిని గుర్తించి, వారిని విచారించి గుట్కా మాఫియా నుంచి డబ్బులు దండుకున్న పోలీసు అధికారుల జాబితాను తయా రు చేసినట్లు తెలిసింది. గుట్కా మాఫియాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకుని ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారనే దానిపై పూర్తి ఆధారాలు లిఖిత పూర్వకంగా తీసుకున్నట్లు సమాచారం. గుట్కా మాఫియా వ్యవహారంలో టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో తెలి యక అవినీతి పోలీసు అధికారులు హడలి పోతున్నారు.

ఎన్నికల్లో వసూళ్లపైనా ఆరా
గుట్కా మాఫియా నుంచే కాకుండా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతల నుంచి పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై సైతం విచారణ జరుపుతున్నారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు ఎవరి నుంచి ఎంతెంత తీసుకున్నారనే జాబితాను ఎస్పీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే జిల్లాలో దాదాపు 90 శాతం మంది పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతల నుంచి డబ్బులు తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే. మరి అలాంటప్పుడు ఈ వ్యవహారాన్ని కదిలిస్తే అందరిపై వేటు వేయాల్సి ఉంటుందని, అది సాధ్యమా అనేదానిపై పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ఎస్పీ ఏవిధంగా ముందుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.మొత్తానికి జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి భాగోతంపై విచారణ నడుస్తుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు మూడు రోజుల్లోనే అవినీతి పోలీసు అధికారులపై నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు ఎస్పీ సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement