
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన నగదుతో పాటు పట్టుబడ్డ ల్యాప్‌టాప్ ఏమైంది? దాని గుట్టును అధికారులు విప్పారా? ఒకవేళ విప్పితే ఏయే రహస్యాలు బయటపడ్డాయి? ఇప్పటివరకు వాటిని ఎందుకు బహిర్గతం చేయలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు లాడ్జీలో కోడుమూరు టీడీపీ అభ్యర్థి రామాంజినేయులు తరఫున వ్యవహారాలు నడుపుతున్న ఓ వ్యక్తి వద్ద నగదుతో పాటు చెక్‌బుక్‌లు, ల్యాప్‌టాప్ దొరికాయి. ఈ విషయాన్ని కర్నూలు నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కూడా అప్పట్లో ధ్రువీకరించారు. ల్యాప్‌టాప్‌లో అప్పటి అధికార పార్టీ వ్యవహారాలతో పాటు నగదు లావాదేవీల వివరాలు కూడా నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాన్ని వదిలేయాలంటూ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఇక్కడి అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు. వారు వినకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ల్యాప్‌టాప్ దొరికిందని ప్రకటించినప్పటికీ అందులో ఏ సమాచారం ఉందన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.
ఇంకా రహస్యంగానే..
ఎన్నికలు ముగిసిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడైనా ల్యాప్‌టాప్ గుట్టును అధికారులు రట్టు చేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అందులో నగదు పంపిణీ వివరాలతో పాటు మరిన్ని రహస్యాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఆర్థిక లావాదేవీలతో పాటు మరికొద్ది మందిఆ పార్టీ అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, ఏయే కాంట్రాక్టర్ల నుంచి ఎంత మొత్తం సమీకరించాల్సి ఉందన్న అంశాలు కూడా ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమై ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి కీలకమైన ల్యాప్‌టాప్ కావడం వల్లే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీతో పాటు నేరుగా సీఎంవో జోక్యం చేసుకుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఏకంగా ల్యాప్‌టాప్‌ను మార్చేశారా అనే ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి.
నగదు మాటేమిటి?
ల్యాప్‌టాప్ గుట్టును తెలియజేయకపోవడంతో పాటు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నగదును కూడా చాలా కొంచెం చూపినట్టు తెలుస్తోంది. తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడిందన్న ప్రచారం అప్పట్లో సాగింది. అయితే..పోలీసులు రూ.వేలల్లోనే చూపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల్లో పనిచేసేందుకు ఎక్కడి నుంచో వచ్చిన సదరు వ్యక్తి వద్ద కేవలం వేలల్లోనే నగదు పట్టుబడిందంటే నమ్మశక్యంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంలో తనిఖీలు జరిపిన పోలీసులు కళ్లు గప్పారా? లేదా ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగా చూపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే తప్ప అసలు రహస్యాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.
రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌పై దాడి
డోన్ రూరల్ : పట్టణ సమీపంలోని కంబలపాడు సర్కిల్‌లో శనివారం అర్ధరాత్రి రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణ సీఐ కళావెంకటరమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కంబలపాడు సర్కిల్‌లో శనివారం అర్ధరాత్రి రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment