టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుతో నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సీజన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు తరలింపుపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. జోరుగా తనిఖీలు సాగుతుండటంతో నేరుగా తీసుకువెళితే ఇబ్బందనే ఉద్దేశంతో అక్రమ రవాణా కోసం హుండీ మార్గాన్ని అనుసరిస్తోంది. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలో అంతర్గతంగా జరిగే దాన్ని హుండీ అని అంటారు. ఈ బాధ్యతల్ని ఎక్కడికక్కడ స్థానిక నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు హుండీ మార్గంలో పంపుతున్న రూ.60 లక్షల్ని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు.
ఈ నగదును తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్, ఆయన స్నేహితుడు సైఫాబాద్‌కు చెందిన వర్మ సమకూర్చారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఆయన వాహనంలోనే, సొంత డ్రైవర్ తరలించారని వివరించారు. పన్ను ఎగ్గొట్టడంతో పాటు అక్రమ కార్యకలాపాల కోసం సాగే ఈ దందాలు ఎన్నికల నేపథ్యంలో జోరందుకుంటూ ఉంటాయి. ఈసీ సైతం అభ్యర్థుల బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచడంతో ప్రత్యామ్నాయ మార్గాలు సాగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా వరుసపెట్టి హుండీ ముఠాలు చిక్కుతున్నాయి.
పక్కా సమాచారంతో దాడి...
నగరంలోని కోఠి ప్రాంతంలో భారీ మొత్తం నగదు మార్పిడి జరుగుతున్నట్లు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో వలపన్నిన బృందం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిసరాల్లో మఫ్టీల్లో కాపుకాసింది. బుధవారం రాత్రి తెలుపు రంగు వెర్నా కారు (ఏపీ 09 సీఎఫ్ 1144)లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అక్కడి పూజ ఫ్యాషన్స్ పేరుతో ఉన్న రెడీమేడ్ వస్త్రదుకాణంలోకి వెళ్లడాన్ని గమనించారు. మఫ్టీ పోలీసులు వీరిని నీడలా వెంటాడుతూ ఆ దుకాణంలోకి వెళ్లగా... బ్యాగులో ఉన్న నగదును ఆ దుకాణం యజమాని నరేశ్ తండ్రి గుమన్‌సింగ్ రాజ్‌పురోహిత్‌కు కొంత, సిరిసిల్ల అవినాశ్‌కు మరికొంత అందించారు.
గుమన్‌సింగ్‌కు ఇచ్చిన మొత్తాన్ని ఆ దుకాణంలో పని చేసే నేపాల్ సింగ్ లెక్కిస్తుండగా... దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ ఫోర్స్ టీమ్ మొత్తం ఐదుగురినీ అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో వెర్నా కారులో నగదు తీసుకువచ్చింది వల్లభనేని అనిల్ కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్ అని గుర్తించిన పోలీసులు ప్రశ్నించగా... ఆ మొత్తం తన యజమానే ఇచ్చారని వెల్లడించాడు. తన వెంట ఉన్న మరో వ్యక్తి తన బావమరిది డి.శ్రీనివాసరావు అని, సాయం కోసం తీసుకువచ్చానని చెప్పాడు. మొత్తం రూ.60 లక్షలతో పాటు వాహనాన్నీ తనకు అప్పగించిన యజమాని అనిల్‌కుమార్, స్నేహితుడు వర్మ రూ.50 లక్షలు పూజ ఫ్యాషన్స్ యజమానికి, రూ.10 లక్షలు అవినాశ్‌కు ఇవ్వాలని సూచించారని చెప్పాడు.
జూబ్లీహిల్స్ రేసులో అనిల్‌కుమార్?..
అనిల్ కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పాత బెల్లంకొండవారి పాలెం. సాధారణ కుటుంబానికి చెందిన ఇతని తండ్రి ఓ రైతు. దాదాపు 20 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చారు. అప్పట్లో ద్విచక్ర వాహనం సైతం లేకుండా కాలినడకన తిరిగినట్లు సమాచారం. తొలినాళ్లలో సినిమా నిర్మాణ సమయంలో జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేస్తుండేవాడు. ప్రస్తుతం తెలంగాణ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఉన్న అనిల్‌కు రూ.కోట్లలో ఆస్తి ఉందని సమాచారం. నందిగామలోనూ బినామీ పేర్లతో భారీగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫున నందిగామ ఎమ్మెల్యేగా నిలబడే వారి కోసం అనిల్ ప్రత్యేకంగా ప్రచార రథాలు హైదరాబాద్‌లో రూపొందించి పంపేవారు. ఇటీవల అమరావతి వెళ్లిన అనిల్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తనకు తెలుగుదేశం తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం.
వస్త్ర వ్యాపారం ముసుగులో దందా...
వస్త్రవ్యాపారం ముసుగులో నరేశ్, కంప్యూటర్ ఆపరేటర్ ముసుగులో అవినాశ్ ఏళ్లుగా హుండీ, హవాలా దందాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 కమీషన్ తీసుకుంటూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ నగదు తరలిస్తూ ఉంటారని వెలుగులోకి వచ్చింది. ఈ రూ.60 లక్షల్ని జగిత్యాలలో ఉన్న కళ్యాణ్ డ్రస్సెస్‌కు పంపాలని వీరు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో హవాలా దందా నిర్వహించే ఆ దుకాణ నిర్వాహకులు అక్కడి తెలుగుదేశం నాయకులకు నగదు అప్పగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్, గుమన్‌సింగ్, నేపాల్ సింగ్, శ్రీనివాస్, అవినాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వల్లభనేని అనిల్‌కుమార్‌కు చెందిన వాహనం, సెల్‌ఫోన్‌లు, మరో ద్విచక్ర వాహనంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించగా రూ.59,00,500 ఉన్నట్లు తేలింది. ఈ నగదు పంపడంలో కీలకంగా వ్యవహరించిన వర్మ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేతకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనిల్ ఇంట్లో కీలక నేతల భేటీ...
మణికొండ చిత్రపురికాలనీలోని ఓ మండపంలో మంగళవారం రాత్రి జరిగిన పూజ కార్యక్రమాలకు ఈ నేతతో పాటు మరికొందరు కీలక టీటీడీపీ నాయకులు హాజరయ్యారని తెలిసింది. పూజ ముగిసిన తర్వాత అక్కడే ఉన్న అనిల్‌కుమార్ ఇంట్లో వీరంతా దాదాపు రెండు గంటల పాటు సమావేశమై కీలకాంశాలు చర్చించారని సమాచారం. ఇది జరిగిన మరుసటి రోజే అనిల్, వర్మ జగిత్యాలకు రూ.60 లక్షలు హుండీ రూపంలో పంపే ప్రయత్నం చేయడంతో ఇది ఎన్నికల ఖర్చులకు సంబంధించిన డబ్బే అని, దీని వెనుక సదరు టీటీడీపీ నాయకుల పాత్ర సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం ఐదుగురితో పాటు నగదునూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. ఈ నగదు తరలింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఇలాంటి దందాలు జోరందుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న హవాలా, హుండీ ఏజెంట్లపై డేగకన్ను వేశారు.
Comments
Please login to add a commentAdd a comment