
తుళ్లూరు (గుంటూరు జిల్లా): అమరావతి పరిధిలోని నెక్కళ్లు గ్రామంలో వెలుగు చూసిన భూ కుంభకోణం కేసులో టీడీపీ నేతను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో కొందరు టీడీపీ నేతలు దొంగపత్రాలు సృష్టించి.. లేని భూమిని ఉన్నట్టు చూపి ప్లాట్లు పొందారు. దీనికి తోడు అసలైన రైతుకు సీఆర్‌డీఏ సర్వేలో తక్కువ విస్తీర్ణం చూపించి.. టీడీపీ నేతలకు మాత్రం అసలు భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం, భూమి లేకపోయినా ఉన్నట్టు చూపించారు.
రైతుల ఫిర్యాదుతో..
► తమ భూమిని టీడీపీ నేతలు కాజేశారంటూ నెక్కళ్లు గ్రామానికి చెందిన అసలు రైతులు గతంలో తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
► దీనిని తహసీల్దార్ తుళ్లూరు సీఐకి సిఫారసు చేయగా.. సిట్ విచారణ చేపట్టింది.
► విచారణాధికారులు నెక్కళ్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
► మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం.
► ఇక్కడి భూ కుంభకోణాలపై సిట్ విచారణ కొనసాగుతుండటంతో అప్పట్లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది.