విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న జీడిపిక్కల బస్తాలు
రణస్థలం: విజిలెన్స్ అధికారులకు గతంలో ఒకమారు పట్టుబడినా ఓ టీడీపీ నాయకుడి వక్ర బుద్ధి మారలేదు. దర్జాగా తన అక్రమ వ్యాపార దందా సాగిస్తున్న అతడిపై గట్టిగా నిఘా పెట్టి మరోమారు దాడుల అస్త్రం ప్రయోగించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,876 జీడిపిక్కల బస్తాలు బయటపడ్డాయి. మొత్తం 93 టన్నులున్న వీటి విలువ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిషిణి జగన్నాథం ఏడెనిమిది ఏళ్లుగా జీడిపిక్కల వ్యాపారం చేస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా జీడిపిక్కల గొడౌన్ ఏర్పాటు చేశాడు. ఇందుకు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ దర్జాగా లాభాలు ఆర్జిస్తున్నాడు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించలేదు. అప్పట్లో ఓ మంత్రి అండదండలు కూడా ఈయనకు పుష్కలంగా ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అదే నెలలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా విధించారు. అయినా పద్ధతి మారకపోవడంతో ఇతని బాగోతంపై విజలెన్స్ అధికారులు మరోమారు పక్కా నిఘా పెట్టి శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది, ఏఎంసీ సెక్రటరీ చిన్నికృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి ఎల్‌వీ అప్పలనాయుడు ఉన్నారు.
ఏ ఒక్కటికీ అనుమతి లేదు..
దీనిపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పన్నులు కూడా చెల్లించలేదన్నారు. జీడి పిక్కల నిల్వ ఉంచేందుకు గొడౌన్‌కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు కూడా ప్రభుత్వం నుంచి పొందలేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకును శనివారం లావేరు మండలం బెజ్జిపురం వ్యవసాయ మార్కెట్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment