సాక్షి, సోమాపురం(కడప) : మండలంలోని సోమాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ వర్గీయులు గ్రామంలోని రామాలయాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పాత ఆలయాన్ని కూల్చి వేసి దాని స్థానంలో నూతన ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు మూడేళ్ల క్రితం గ్రామస్తులు రూ.14లక్షల వరకు విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పడింది. టీటీడీ నుంచి ఆలయ నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరయ్యాయి.
మూడేళ్లుగా నూతన ఆలయ నిర్మాణం పేరుతో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్రామంలో ఆలయ నిర్మాణంపై టీడీపీ నాయకులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో సమస్య తలెత్తగా, ఆలయ నిర్మాణం కమిటీలో మార్పులు జరగాలని గ్రామ ప్రజలందరికీ ఆమోదం ఉండాలని వైఎస్సార్‌సీపీ వర్గీయులు అభ్యంతరాలు తెలిపారు. ఎన్నికల అనంతరం గత వారం రోజుల నుంచి ఆలయ నిర్మాణం చేపట్టాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆలయ కమిటీ నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క వైఎస్సార్‌సీపీ వర్గీయుడైన పోలు వెంకటరామిరెడ్డి ఆలయ కమిటీలో మార్పులు చేసి ఇరు వర్గీయులకు ఆమోదయోగ్యంగా చర్యలు తీసుకోవాలని సూచించాడు.
దీనికి టీడీపీ నాయకులు ససేమిరా అనటంతో సమావేశం అర్ధంతరగా ఆగిపోయింది. ఇంతలో ఆలయ నిర్మాణం తమ ప్రమేయంతోనే జరగాలనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్రామంలోని రామాలయాన్ని ట్రాక్టర్ల సాయంతో కూల్చివేశారు. కాగా కొత్త ఆలయాన్ని నిర్మించే యోచనలో మూడు నెలల క్రితమే ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తాత్కాలికంగా పక్కనే ప్రతిష్టించారు. ఇంతలోనే ఆలయాన్ని కూల్చివేయడంతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్ దీనిపై మాట్లాడుతూ ఇరు వర్గీయులను కోర్టుకెళ్లాలని, కేసులు పెట్టాల్సి వస్తే ఇరువర్గాలపై పెట్టాల్సి వస్తుందని చెప్పటంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఆలయం కూల్చిన సంఘటనకు సంబంధించి టీడీపీ వరీ ్గయులైన లెక్కల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, అంకిరెడ్డిపల్లె చిన్న కొండారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి,సుబ్బరామిరెడ్డి ఇంకా పలువురిపై పోలు వెంకటరామిరెడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment