
ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న సరస్వతి
అనంతపురం, ఉరవకొండ: వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన భార్యపై ఉపాధ్యాయుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాకెట్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌరిశంకర్‌కు ఉరవకొండకు చెందిన సరస్వతితో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. గౌరీశంకర్ మండలంలోనే పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో సహజీవనం కూడా చేస్తున్నాడు. దీనిపై నిలదీసిన భార్యను వేధించేవాడు.
పెద్దలు జోక్యం చేసుకుని.. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని సూచించినా పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలని భావించిన సరస్వతి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఉపాధ్యాయ, మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు రాజకీయ నాయకులను కలిసి గోడు వెల్లబోసుకుంది. విషయం తెలుసుకున్న గౌరీశంకర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సరస్వతిని ఇష్టానుసారంగా చితకబాదాడు. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు ఉపాధ్యాయసంఘాల నాయకులతోపాటు జెడ్పీటీసీ తిప్పయ్య సహకారంతో శుక్రవారం రాత్రి ఉరవకొండ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ జనార్దన్‌నాయుడుకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment