లావణ్య (26)
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అరసన్‌కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్‌తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్‌ఫోన్, బైక్ దోచుకెళ్లారు.
స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment