సాక్షి, సిటీబ్యూరో: ‘న్యూ ఇయర్’ వేడుకలపై సైబరాబాద్, రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలో మాదక ద్రవ్యాలైన కొకైన్, హెరాయిన్, గంజాయి, ఎల్‌ఎస్‌డీ డ్రగ్ స్టాంప్, ఛరస్‌లను భారీగా సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో నిఘా మరింత ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాలు వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇరు కమిషనరేట్ల ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఎక్కడా ఏ అనుమానమొచ్చినా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యువత నిర్వహించే పార్టీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
నైజీరియన్లపై నజర్....
గతంలో మాదక ద్రవ్యాల సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన వారిలో నైజీరియన్లే ఎక్కువగా ఉండటంతో వారి ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 30 కేసులు నమోదు కాగా 63 మందిని అరెస్టు చేశారు. 548 కేజీల గంజాయి, 10 గ్రాముల కొకైన్, 20 గ్రాముల హెరాయిన్‌తో పాటు 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనూ అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం విరివిగా ఉండవచ్చునని సమాచారం అందడంతో ఇరు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్న వారిలో శివారు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిపై నిఘా ఏర్పాటు చేశారు. చట్టవిరుద్ధమైన రేవ్‌పార్టీలపై కూడా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు.
వేడుకల వేదికలపై దృష్టి...
ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్ యాజమాన్యాలకు సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ‘న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 8 గంటల నుంచి 1 వరకే అనుమతి ఉంటుంది. సమయం మించితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. డీజేలకు అనుమతి లేదు. సౌండ్ సిస్టమ్‌ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి. డ్రగ్స్, హుక్కా సేవించడంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. రేవ్ పార్టీలకు అనుమతి లేద’ని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల ఈవెంట్ల కోసం 40 దరఖాస్తులు రాగా, రాచకొండలో 20 వరకు వచ్చాయి. మరికొన్ని రోజులు సమయం ఉండటంతో వీటి సంఖ్య పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సైబరాబాద్‌లో ఎక్కువగా మాదాపూర్, గచ్చిబౌలిలోని స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, శంషా బాద్, ఇబ్రహీంపట్నంలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. రాచకొండలో హయత్‌నగర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అందినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నగరవాసులు,నిర్వాహకులు సహకరించాలని కోరారు.
మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
నాగోలు: నూతన సంవత్సర వేడుకల కోసం నగరంలో గంజాయి, కొకైన్, తదితర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 10 గ్రాముల కొకైన్, 4 కేజీల గంజాయి, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కెన్యా దేశానికి చెందిన రేమండ్ నగరానికి వచ్చి సైనిక్‌పురిలో ఉంటున్నాడు. ఇతను గతంలో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, కొకైన్ తీసుకువచ్చి నగరంలో విక్రయించేవాడు. నేరెడ్‌మెట్‌కు చెందిన సుమంత్, నిజామాబాద్‌కు చెందిన ఎం.డీ.హుస్సేన్, నైజీరియాకు చెందిన సమ్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. సమ్ ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలు తెచ్చి సుమంత్‌కి ఇచ్చేవాడు.ఆర్మూర్‌కు చెందిన ఎం.డీ.హుస్సేన్ వద్ద సంపత్ గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేవాడు. వీరు నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు వారిపై నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం గోకుల్‌నగర్‌లో గంజాయి, కొకైన్‌ను సరఫరా చేస్తున్న రేమండ్, సుమంత్, హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. రేమండ్ 2013లో స్టూడెంట్ వీసాపై నగరానికి వచ్చాడని, వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు తెలిపారు. సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ నవీన్‌కుమార్, నేరెడ్‌మెట్ సీఐ నర్సింహ్మస్వామి, ఎస్‌ఓటీ ఎస్‌ఐలు రత్నం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment